తెలుగు ఇండియన్ ఐడిల్ 14వ ఎపిసోడ్ సైతం సరదా సరదాగా సాగిపోయింది. శుక్రవారం తమన్, నిత్యామీనన్, కార్తీక్ సినిమాలకు సంబంధించిన పాటలు పాడిన కంటెస్టెంట్స్… శనివారంఈ ప్రోగ్రామ్ కు గెస్ట్ గా వచ్చిన వరుణ్ తేజ్ మూవీ సాంగ్స్ పాడి అలరించారు. మొదటగా వచ్చిన శ్రీనివాస్ ధరిమిశెట్టి ‘తొలిప్రేమ’లోని ‘నింగిలా నిన్నిలా చూశానే’ పాటతో బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని వోకల్ కార్డ్స్ కు ఏమైనా అయిపోతుందేమోననే భయం వేస్తోందని, అద్భుతమైన పిచ్ లో పాట పాడాడని తమన్ అభినందించాడు. నిత్యామీనన్ ‘ఫ్యాబ్యులెస్’ అంటూ లవ్ సింబల్ చూపించేసింది. పాట పాడేసిన తర్వాత శ్రీనివాస్ ప్రేమకథను క్లుప్తంగా వరుణ్ తేజ్ కు చెప్పాడు తమన్. దాంతో అమ్మాయిలకు ఎలా ప్రపోజ్ చేయాలో తాను చెబుతానంటూ స్టేజ్ మీదకు వచ్చాడు వరుణ్ తేజ్. శ్రీరామచంద్రకు దుప్పట్టా చుట్టి సాయిపల్లవి లా నిలుచో పెట్టాడు. ఆ తర్వాత ‘ఫిదా’లోని డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు వరుణ్ తేజ్.
‘సారొస్తారొస్తారా’ పాట వెనుక కథ చెప్పిన తమన్!
తనదైన గాత్రంతో, అందంతో అందరినీ ఆకట్టుకుంటున్న వాగ్దేవి తాజాగా విడుదలైన ‘గని’ సినిమాలోని ‘రోమియోకు జూలియట్ లా…’ పాటను పాడింది. నిజానికి ‘గని’ సినిమాలో ఆ పాటకు తగ్గ సన్నివేశం ఏదీ లేకపోయినా… ఓ మంచి మెలోడీ ఉంటే బాగుంటుందని తానే బ్రతిమిలాడి, అడుక్కుని ఆ పాట పెట్టించానని తమన్ చెప్పాడు. ఓ సంగీత దర్శకుడిగా ఇలా చాలా సినిమాల విషయంలో మెలోడీ పాటలను అడిగి మరీ తాను పెట్టిస్తుంటానని, మహేశ్ బాబు ‘దూకుడు’ మూవీలోనూ మెలోడీ సాంగ్ ఉంటే బాగుంటుందని ‘సారొస్తారొస్తారా…’ పాటను అలానే అడిగి పెట్టించానని చెప్పాడు. ‘గని’లోని ఈ పాట రచన గురించి కూడా తమన్ వివరించాడు.
ఆ తర్వాత వైష్ణవి ‘తొలిప్రేమ’ సినిమాలోని ‘అల్లసాని వారి పద్యమా’ పాటను అద్భుతంగా పాడింది. ఆమె పాటకు వాద్య బృందం సైతం గొప్పగా సహకరించింది. దాంతో వారినీ వేదికపైకి పిలిచి ‘బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్’ అంటూ అభినందించారు న్యాయనిర్ణేతలు. శ్రేయాఘోషల్ తనకెంతో ఇష్టమైన ఫిమేల్ సింగర్ అని చెప్పిన తమన్… ఆమెను మరిపించే విధంగా వైష్ణవి ఈ పాట పాడిందని మెచ్చుకున్నాడు. ఒకవేళ శ్రేయా ఘోషల్ ఈ పాట వింటే తప్పకుండా వైష్ణవిని అభినందిస్తుందని తమన్ అన్నాడు. పాట విన్న వరుణ్ తేజ్ కొన్నిసార్లు తనకు గూస్ బంప్స్ వచ్చాయని తెలిపాడు. ‘తొలిప్రేమ’లోని ఈ పాట తనకెంతో ఇష్టమని చెప్పాడు. గీత రచయిత శ్రీమణి, దర్శకుడు వెంకీ అట్లూరిని ఈ సందర్భంగా తమన్ అభినందించాడు. కథను ముందుకు తీసుకుపోయే పాట ఇదని అన్నాడు.
మాస్ హీరో అనిపించుకున్న వరుణ్ తేజ్
సింగర్ జయంత్ ‘గద్దలకొండ గణేశ్’ మూవీలోని ‘జరా… జరా…’ పాట పాడాడు. నిజానికి ఇలాంటి పాటను మిక్కీ జే మేయర్ నుండి ఊహించలేమని, అందులో దర్శకుడు హరీశ్ శంకర్ ప్రోద్భలంగా ఉండి ఉంటుందని తమన్ చెప్పాడు. జయంత్ ను న్యాయనిర్ణేతలంతా అభినందించారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. మొదటి నుండి జయంత్ ను శ్రీరామ్ చంద్ర ‘మాస్ హీరో ఆఫ్ తెలుగు ఇండియన్ ఐడిల్’ అంటూ సంభోదిస్తున్నాడు. దాంతో గెస్ట్ గా వచ్చిన వరుణ్ తేజ్ కు ఈ మాస్ హీరో ఓ ఛాలెంజ్ విసిరాడు. ఇటుక రాయిని చేతితో ఎవరు పగలగొడితే వారే అసలు మాస్ హీరో అంటూ డిక్లేర్ చేశాడు. అయితే పాపం… జయంత్ చేతికి నొప్పి వచ్చింది తప్పితే ఇటుక రాయి పగలలేదు. ‘గని’ కోసం సూపర్ మేకోవర్ చేసిన వరుణ్ తేజ్ ఠక్కున ఇటుక రాయిని పగలగొట్టి మాస్ హీరో అనిపించుకున్నాడు. చక్కగా పాటలు పాడుకోకుండా… ఇలాంటి ఛాలెంజెస్ ఎందుకు చేస్తావంటూ జయంత్ కు సరదాగా హితవు పలికాడు వరుణ్ తేజ్. అంతేకాదు… జయంత్ కు ప్రత్యేకంగా తెచ్చిన ‘గని’ టీషర్ట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు.
శనివారం చివరగా లక్ష్మీ శ్రావణి ‘ఫిదా’ మూవీలోని ‘హే పిల్లగాడా… ఏందిరో పిలగాడా’ పాటు శ్రావ్యంగా పాడింది. మాస్ పాటలకు స్పెషల్ అయినా శ్రావణి నుండి మెలోడీ సాంగ్ విని జడ్జీలు ఎంతో సంతోషించారు. ఈ రెండు ఎపిసోడ్స్ లో బెస్ట్ పెర్ఫార్మర్ గా శ్రీనివాస్ ధరిమిశెట్టి నిలచి, గిఫ్ట్ హ్యాంపర్ అందుకున్నాడు. ఇక ఏప్రిల్ 8న పుట్టిన బ్యూటీ క్వీన్ నిత్యామీనన్ బర్త్ డే వేడుకలను ఎపిసోడ్ చివరిలో అందరూ కలిసి నిర్వహించారు. ఈ స్పెషల్ పార్టీకి నిత్యా మీనన్ ‘ఫిదా’ అయిపోయింది. ఎప్పటిలానే తమన్ తనదైన పంచ్ లతో ఆకట్టుకున్నాడు. ఈ షోకు గెస్ట్ గా వచ్చిన వరుణ్ తేజ్ గురించి చెబుతూ, ‘గని’ సినిమా కోసం అతను ఎంతో కష్టపడ్డాడని, తెర మీద కనిపించే మజిల్స్ ను పొందడం అంత ‘ఈజీ’ కాదని, అవి ‘సీజీ’ కాదని చెబుతూ, వరుణ్ తేజ్ డేడికేషన్ ను అభినందించాడు.