Kartikeya 2: ప్రస్తుతం హిందీ పరిశ్రమలో సౌత్ సినిమాలు సత్తా చూపుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి హిందీ ప్రేక్షకులు తెలుగు సినిమాలు మాత్రమే చుస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ భాషా బేధాన్ని చూపించరు. పుష్ప, కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, ఇప్పుడు కార్తికేయ 2.. ఇలా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో జెండా ఎగరవేస్తున్నాయి. చిన్న సినిమాగా హిందీలో రిలీజైన కార్తికేయ 2.. రోజురోజుకు థియేటర్లను పెంచుకొంటూ వెళ్ళిపోతోంది. ఇక దీంతో నిఖిల్ దెబ్బకు బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను ఆపేసుకొనే పరిస్థితి వచ్చింది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోలు అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన లాల్ సింగ్ చద్ధా, రక్షా బంధన్ రిలీజ్ అయ్యాయి అన్నమాటే కానీ బావుంది అని చెప్పిన ప్రేక్షకులు లేరు.
ఇక ఈ నెగెటివ్ టాక్ కార్తికేయ 2 కు బాగా కలిసి వచ్చింది. దీంతో పాటు ప్రొడక్షన్ హౌస్.. అభిషేక్ పిక్చర్స్.. ఇటీవలే ది కాశ్మీర్ ఫైల్స్ తో హిట్ అందుకున్న సంస్థ కాబట్టి వెంటనే ప్రేక్షకులు ఈ సినిమా కోసం పరుగులు పెడుతున్నారు. మరికొందరు కంటెంట్ ను చూసి థియేటర్స్ కు వెళ్తున్నారు. శ్రీ కృష్ణుడి నేపథ్యం కావడంతో ఆయన గురించి తెలుసుకోవడానికి థియేటర్స్ బాట పట్టినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా బాలీవుడ్ లో నిఖిల్ దెబ్బకు.. స్టార్ హీరోలు సైతం అబ్బా అని అంటున్నారట. సౌత్ హీరోలు అంటే ఆ మాత్రం ఉండాలి అని ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందుముందు కార్తీకేయ 2 హిందీలో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.