మెగా డాటర్ నిహారిక కొనిదెల సినిమాల్లో హీరోయిన్గా పెద్ద సక్సెస్ సాధించలేకపోయినా, నిర్మాతగా మంచి స్థానం సంపాదించుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అతిపెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, ఆమె కెరీర్లో సవాళ్లు ఎదుర్కొన్నారు. ‘ఒక మనసు’తో వెండితెరపై అడుగు పెట్టిన నిహారిక, తర్వాత సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో నటించినా పెద్దగా ఫలితం రాలేదు. కొంతకాలం సినిమాలకు దూరమై, తర్వాత నిర్మాతగా పయనం మొదలు పెట్టారు.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచీ, మ్యాడ్ హౌస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్ వంటి వెబ్ సిరీస్‌లను రూపొందించారు. గతేడాది వచ్చిన కమిటీ కుర్రోళ్లు సినిమా మంచి కలెక్షన్స్‌తో పాటు గద్దర్ అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం సంగీత్ శోభన్ హీరోగా మానస శర్మ దర్శకత్వంలో మరో సినిమాను నిర్మిస్తున్నారు. ఇక వ్యక్తిగత జీవితంలో నిహారిక జీవితంలో చాలా పెద్ద దెబ్బ తగిలింది.
వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహ బంధం కొన్ని సంవత్సరాలు మాత్రమే నిలిచింది. ఇద్దరి మధ్య వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె “విడాకుల తర్వాత కుటుంబంతో కాకుండా నేను సెపరేట్‌గా ఉంటున్నాను. అయినా నా బలం మాత్రం పెదనాన్న, నాన్న, బాబాయ్, అన్నయ్యలే. రెండు రోజులకు ఒకసారి అయినా వారిని కలుస్తూనే ఉంటాను” అని అన్నారు. అన్నయ్య వరుణ్ తేజ్‌కు కొడుకు పుట్టడంతో “నాకు అత్తగా ప్రమోషన్ వచ్చింది. బాబును ఎత్తుకుంటే నాకు ఇంట్లో ఎవరూ పనులు చెప్పడం లేదు. వీడు పెద్దయ్యాక స్టార్ అయితే ఖచ్చితంగా నా బ్యానర్లో సినిమా చేస్తాను” అంటూ నవ్వుకొచ్చారు. ఇంటికి దూరంగా ఉంటున్న అనడంతో ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.