People Media Factory: నవదీప్, బిందుమాధవి కీలక పాత్రలు పోషించిన వెబ్ సీరిస్ ‘న్యూసెన్స్’. శ్రీప్రవీణ్ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీన్ని నిర్మించింది. ఆహాలో ఈ వెబ్ సీరిస్ ఈ నెల 12 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవదీప్, బిందుమాధవి, శ్రీప్రవీణ్, వివేక్ కూచిభొట్ట హాజరయ్యారు. ఇటీవల ఈ వెబ్ సీరిస్ టీజర్ విడుదలైనప్పుడు సోషల్ మీడియాలో వాడి వేడి చర్చ జరిగింది. ‘డబ్బుకు మీడియా దాసోహమా?’ అనే ప్రశ్నపై నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు.
మీడియాకు సంబంధించిన కీలకమైన సమస్యను ఎత్తి చూపేలా రూపొందించిన ‘న్యూసెన్స్’ షో గురించి నవదీప్ మాట్లాడుతూ “నేటి సమాజంలో మీడియాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి దానిపై ఓ ప్రత్యేకమైన దృక్పథాన్ని ఏర్పరిచేలా రూపొందిన ‘న్యూసెన్స్’లో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. సిరీస్ ప్రారంభం నుంచి చివరి ఆడియెన్స్‌ను ఈ సిరీస్ అలా కట్టిపడేస్తుంది’’ అన్నారు. నటి బిందు మాధవి మాట్లాడుతూ “నటీనటులుగా ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ఉండేలా చూసుకోవటమే కాదు, అందరిలో ఓ పాజిటివ్ దృక్పథాన్ని పుట్టించేలా ఉండే కంటెంట్‌ను క్రియేట్ చేయటం మా బాధ్యత. కచ్చితంగా అలాంటి ప్రభావాన్ని ‘న్యూసెన్స్’ సిరీస్ కలిగిస్తుందనే భావన ఉంది. అంతే కాదు.. నేటి మీడియా రంగం సమాజంపై చూపుతోన్న ప్రభావంపై ఆందోళన చెందే వారందరూ తప్పనిసరిగా ఈ సిరీస్‌ను చూడాల్సిందే’’ అని అన్నారు. దర్శకుడు శ్రీప్రవీణ్ మాట్లాడుతూ “మన సమాజం ఎలా ఉంది? దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే విషయాలను తెలియజేయటం ఓ క్రియేటర్‌గా నా బాధ్యత. న్యూస్ స్ట్రింగర్స్ ప్రపంచంలోకి వెళ్లి లోతుగా అధ్యయనం చేసేలా ఉండేదే ఈ ‘న్యూసెన్స్’ సిరీస్. అలాగే న్యూస్ రిపోర్టింగ్‌లో ఉండే విలువలను ప్రశ్నించేలా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా, నిజాయతీతో ఓ రంగానికి సంబంధించిన విషయాలను చూపించేలా రూపొందిన ఈ సిరీస్ ఆడియెన్స్‌కు నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు.