Naveen Chandra: ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర ఆ తర్వాత అనేక చిత్రాల్లో కథానాయకుడి పాత్రలు పోషించి మెప్పించాడు. అంతేకాదు.. ‘నేను లోకల్, దేవదాస్, అరవింద సమేత’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలూ పోషించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’లోనూ కీ-రోల్ ప్లే చేశాడు. అతను హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘మాయగాడు’. ”నేను లేని నా ప్రేమకథ, జమ్నా ప్యార్, కళా విప్లవం, ప్రణయం’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న గాయత్రీ సురేశ్ ఇందులో హీరోయిన్ గా నటించింది. అలానే ‘ద్వారక’ ఫేమ్ పూజా ఝవేరి మరో కథానాయికగా చేసింది.
సుశాంత్ మూవీ ‘అడ్డా’ ఫేమ్ జీ.ఎస్. కార్తీక్ రెడ్డి డైరెక్షన్‌లో ‘మాయగాడు’ సినిమాను భార్గవ్ మన్నె నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. పైరసీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ లవ్ స్టోరీలో హీరో కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటాడు. పైరసీ వలన సినీ పరిశ్రమకు ఏర్పడే నష్టాలను ఇందులో చూపించబోతున్నారు. అభిమన్యు సింగ్, కబీర్ సింగ్, జయప్రకాష్ రెడ్డి, సారిక రామచంద్రరావు తదితరులు ఇతరప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ స్వరరచన చేశారు.