National Cinema Day: నేషనల్ సినిమా డే ఈ నెల 16 నుంచి 23కి మారింది. అయితే దీని వెనుక కొన్ని కార్పోరేట్ సంస్థల హస్తం ఉందంటున్నారు. ఎందుకంటే మన దేశంలో సినిమాను చాలా వరకూ కార్పొరేట్ సంస్థలే ప్రభావితం చేస్తున్నాయి. నేషనల్ సినిమా డే సందర్భంగా దేశంలోని అన్ని మల్టీప్లెక్స్ చైన్‌లలో టిక్కెట్ ధర రూ75గా ఉంచాలనే నిర్ణయం తమ తమ సినిమాలకు ఎంతగానో కలసి వస్తుందని పలువురు చిత్రనిర్మాతలు భావించారు. ఇలా తక్కువ టిక్కెట్ ధర ఆ రోజున విడుదల అయ్యే సినిమాలకు ఎంతో అడ్వాంటేజ్ గా మారి ప్రేక్షకులను భారీస్థాయిలో థియేటర్‌లకు రప్పిస్తుంది అన్నది వారి ఆనందానికి కారణం.
అందుకేనేమో సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రెజీనా-నివేదా ‘శాకిని ఢాకిని’, కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావలసినవాడిని’, బిగ్ బాస్ ఫేమ్ సన్నీకి ‘సకలగుణాభిరామ’ వంటి సినిమాలు సెప్టెంబర్ 16 విడుదలను లక్ష్యంగా చేసుకున్నాయి. నిజానికి వీటిలో కొన్ని సినిమాలు సెప్టెంబర్ 9న, సెప్టెంబర్ 23న విడుదల చేయాలనుకున్నా.. సినిమా డేని క్యాష్ చేసుకోవడానికి 16వ తేదీన రాబోతున్నాయి. అయితే ఇప్పుడు ‘నేషనల్ సినిమా డే’ సెప్టెంబర్ 23కి వాయిదా పడింది. ‘బ్రహ్మాస్త్ర’ బాక్సాఫీస్ వద్ద చక్కటి వసూళ్లను సాధిస్తున్నందున మల్టీప్లెక్స్ యజమానులు 16ను కాదని జాతీయ సినిమా దినోత్సవాన్ని 23 వ తేదీకి మార్చాలని నిర్ణయించుకున్నారు. అది ఇప్పుడు ఈ తేదీని క్యాష్ చేసుకోవాలనుకున్న చిన్న బడ్జెట్ చిత్రాలపై ప్రభావం చూపనుంది. అయితే 23న రాబోతున్న నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’, శ్రీవిష్ణు ‘అల్లూరి’ వంటి సినిమాలకు అది అదృష్టంగా మారనుందన్నమాట.