Venkatesh: గత యేడాది విక్టరీ వెంకటేశ్ నటించిన రెండు సినిమా విడుదలైతే… రెండూ కూడా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి. అందులో మొదటిది తమిళ ‘అసురన్’ తెలుగు రీమేక్ ‘నారప్ప’ కాగా, మరొకటి మలయాళ చిత్రం ‘దృశ్యం-2’ రీమేక్. ఈ రెండు సినిమాలూ వెంకటేశ్ ను నటుడిగా మరో మెట్టు పైకి తీసుకెళ్ళాయి.
థియేటర్లలో ఈ సినిమాలను చూడలేకపోయామని బాధ పడుతున్న వెంకీ ఫాన్స్ కు కొంత ఊరట కలిగించే సమాచారాన్ని నిర్మాత సురేశ్ బాబు ఈరోజు అందించారు. డిసెంబర్ 13న వెంకటేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆ ఒక్క రోజు, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ‘నారప్ప’ను ప్రదర్శించబోతున్నారట. ఇదిలా ఉంటే… ఈ యేడాది విడుదలైన ‘ఎఫ్ 3’ మూవీ క్లయిమాక్స్ లో వెంకటేశ్ ‘నారప్ప’ గెటప్ లో కనిపించి, అభిమానులకు ఆనందాన్ని పంచారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘నారప్ప’లో వెంకీ సరసన ప్రియమణి నాయకగా నటించగా, దీనికి మణిశర్మ సంగీతం అందించారు. ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్ ధానుతో కలిసి సురేశ్ బాబు దీనిని నిర్మించారు. మరి రాబోయే రోజుల్లో ‘దృశ్యం -2’ విషయంలోనూ ఇలాంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటారేమో చూడాలి.