గతేడాది నాని నటించిన ‘వి’ ఓటీటీలో విడుదలైంది. అయితే అది ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు నాని నటించిన ‘టక్ జగదీష్’ విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఉగాదికే విడుదల కావలసింది. అయితే కరోనా పాండమిక్ వల్ల ఇప్పటి వరకూ ఈ సినిమా విడుదల కాలేదు. అంతే కాదు విడుదల ఎప్పుడు అన్న క్లారిటీ కూడా లేదు. ఏప్రిల్ కరోనా వల్ల సినిమా విడుదల వాయిదా వేస్తున్నామంటూ హీరో నాని ప్రకటించాడు. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇటీవల ‘తిమ్మరుసు’ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన నాని సినిమా అనేది మన కల్చర్ లో భాగమని, థియేటర్ కి వెళ్ళి సినిమా చూడటం మన బ్లడ్ లో ఉందని వ్యాఖ్యానించారు. రెస్టారెంట్స్, పబ్స్ ఇతర ప్రదేశాల కన్నా థియేటర్ చాలా సేఫ్ అని… అయితే ఏదైనా సమస్య వచ్చినపుడు వాటినే ముందు మూస్తారు ఆఖరులో తెరుస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వందల మంది మధ్య కూర్చొని థియేటర్ లో సినిమా చూడటం అనేది నెక్స్ట్ జనరేషన్ కి కష్టమే అని కూడా అభిప్రాయపడ్డారు. థియేటర్స్ ప్రాబ్లమ్ ని త్వరగా సాల్వ్ చేయాలని సూచించారు.
నిజానికి తన సినిమా గురించి కాదంటూ నాని స్పష్టం చేసినా ‘టక్ జగదీష్’ విడుదలకు సిద్ధంగా ఉండటంతో పలువురు నాని కామెంట్స్ ని ఆ సినిమా కోసమే అని అన్వయించుకున్నారు. మరి కొందరైతే నానిలా ఇతర హీరోలు కూడా థియేటర్స్ విషయమై స్పందించాలని కోరుకున్నారు. ఇదిలా ఉంటే ఆ తర్వాత ‘టక్ జగదీష్’ ఓటీటీలో విడుదల కానుందంటూ లీకేజ్ లు వచ్చాయి. ఈ విషయాన్ని మాత్రం నాని ధైర్యంగా ఖండించటం కానీ, నిజమేనని చెప్పటం కానీ చేయలేదు. వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. ఆ తర్వాత తను చేస్తున్న సినిమాలు ‘శ్యామ్ సింగ్ రాయ్, అంటే సుందరానికి’ అప్ డేట్స్ షేర్ చేసిన నాని ‘టక్ జగదీష్’ విషయం మాత్రం పూర్తిగా ఇగ్నోర్ చేశాడు. దీంతో నానికి తన సినిమా ఓటీటీలో విడుదల కావటం ఇష్టం లేదని అందుకే ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వటం లేదంటున్నారు. మరి మౌనం వీడి నాని ఈ సినిమా అప్ డేట్స్ ఏమైనా ఇస్తాడేమో చూద్దాం.