జాతీయ అవార్డు గ్రహీత, తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్’. ఇటీవల ధనుష్ పుట్టిన రోజును పురస్కరించుకుని మూవీ టీజర్ ను విడుదల చేశారు. విద్యావ్యవస్థ తీరుతెన్నుల నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని టైటిల్ బట్టీ మాత్రమే కాదు టీజర్ ద్వారానూ తెలిపారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేశారు. షూటింగ్ దాదాపు ముగింపు దశలో ఉన్న ఈ మూవీకి తమిళంలో ‘వాతి’ అనే పేరు పెట్టారు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో ‘సార్’ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. సంయుక్తా మీనన్, సాయికుమార్, తనికెళ్ల భరణి, సముతిర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ‘ఆడుకాలం’ నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు.
ఇదిలా ఉంటే… ఇప్పటికే డిసెంబర్ 2వ తేదీ అడివి శేష్ హీరోగా నాని నిర్మిస్తున్న ‘హిట్ 2’ మూవీ విడుదల కాబోతోందనే ప్రకటన వచ్చింది. సో… బాక్సాఫీస్ బరిలో ఇప్పుడు ధనుష్ ‘సార్’తో నాని, అడివి శేష్ ‘హిట్ -2’ పోటీ పడాల్సి ఉంటుంది.