అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. విశేషం ఏమంటే అది అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ప్రేమ్ నగర్’ మూవీ విడుదలైన రోజు. సరిగ్గా ఈ యేడాది సెప్టెంబర్ 24వ తేదీకి ‘ప్రేమ్ నగర్’ మూవీ విడుదలై 50 సంవత్సరాలు పూర్తవుతుంది. సో… ఈ శుభదినాన ఆయన మనవడు నాగ చైతన్య సినిమా ‘లవ్ స్టోరీ’ విడుదల కావడం కాకతాళీయమే అయినా అక్కినేని అభిమానులంతా ఆనందించే అంశమిది.
చిత్రం ఏమంటే… ఇవాళ ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదల కాగానే… తన తండ్రి నటించిన ‘ప్రేమ్ నగర్’ పోస్టర్ ను, కొడుకు చైతు నటించిన ‘లవ్ స్టోరీ’ పోస్టర్ ను కలిపి నాగ్ ట్వీట్ చేశారు. ‘లవ్ స్టోరీ లుకింగ్ గుడ్ రా చై… ఆల్ బెస్ట్’ అంటూ తన విషెస్ తెలిపారు నాగార్జున. ఇక్కడ ఇంకో విశేషం ఉంది… ‘ప్రేమ్ నగర్’ మూవీని నిర్మించింది డి. రామానాయుడు. దానికి ముందు నిర్మించిన కొన్ని సినిమాలు పరాజయం పాలు కావడంతో… ‘ప్రేమ్ నగర్’ హిట్ కాకపోతే… సినిమా నిర్మాణానికి ఫుల్ స్టాప్ పెట్టేసి సొంతవూరికి వెళ్ళిపోదామని రామానాయుడు నిర్ణయించుకున్నారట. అయితే… కె.యస్. ప్రకాశరావు దర్శకత్వం వహించగా, నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా రూపుదిద్దుకున్న ‘ప్రేమ్ నగర్’ ఘన విజయం సాధించి, రామానాయుడు స్టూడియోస్ ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. దాంతో డి. రామానాయుడు శతాధిక చిత్రాల నిర్మాతగా మారిపోయారు. సో… ఓ తాతయ్య నటించగా, మరో తాతయ్య నిర్మించిన ‘ప్రేమ్ నగర్’ రిలీజ్ రోజున చైతు ‘లవ్ స్టోరీ’ విడుదల కాబోతుండటం అతనికి మరీ మరీ స్పెషల్!