Naga Vamsi: తెలుగు సినీ పరిశ్రమను ఎన్నో ఏళ్లుగా వెంటాడుతున్న అతిపెద్ద సమస్యల్లో సినిమా పైరసీ ఒకటి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే చిత్రాలు రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే పైరసీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ ఛానళ్లలో దర్శనమివ్వడం నిర్మాతలకు భారీ నష్టాలను మిగులుస్తోంది. అయితే తాజాగా రిలీజ్ అయిన ‘లెనిన్’ సినిమా విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి తొలి వీకెండ్ పూర్తయ్యే వరకు పెద్ద ఎత్తున పైరసీకి సంబంధించిన ఎలాంటి సమాచారం వెలుగులోకి రాకపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
దీనికి ఈ సినిమా నిర్మాత నాగ వంశీ అనుసరించిన వ్యూహమే కారణమా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండియన్ సినిమాలు సెన్సార్ ప్రక్రియ కోసం, అలాగే రిలీజ్ కోసం గల్ఫ్ దేశాలకు పంపే టైంలోనే పైరసీ లీకులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ‘లెనిన్’ చిత్రాన్ని ఈసారి యూఏఈ (UAE)లో రిలీజ్ చేయకపోవడంతో పాటు అక్కడి సెన్సార్‌కు కూడా పంపలేదని సమాచారం. దీంతో సినిమా కాపీ బయటకు వెళ్లే అవకాశాలు తగ్గి ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా ఇప్పటివరకు లెనిన్ సినిమా పెద్ద ఎత్తున పైరసీ జరగలేదని అభిప్రాయాలు సినీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ ఈ వ్యూహం నిజంగానే మంచి ఫలితాన్నిస్తే, భవిష్యత్తులో రిలీజ్ అయ్యే భారీ తెలుగు చిత్రాలకు ఇది ఆదర్శంగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైరసీ జరిగే అంశాలను గుర్తించి మరింత కఠిన చర్యలు తీసుకుంటే చిత్ర పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని వారు సూచిస్తున్నారు.

