Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో శ్రీనివాస చిట్టూరి ఇప్పుడో ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య తో మరోసారి కృతీశెట్టి జోడీ కడుతోంది. ఈ బ్యానర్ లో వచ్చిన ‘వారియర్’ మూవీలో నటించడమే కాకుండా నాగచైతన్య సరసన ‘బంగార్రాజు’లోనూ కృతీశెట్టి నటించింది. విశేషం ఏమంటే… స్ట్రయిట్ తెలుగు సినిమాలెన్నింటినో తిరస్కరించిన అరవింద్ స్వామి ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేశారు. ఈ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ని మహేశ్ మాథ్యూ మాస్టర్ పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. తాజా షెడ్యూల్ లో అరవింద్ స్వామి సైతం చేరారు. కృతి శెట్టి, శరత్‌కుమార్, సంపత్ రాజ్ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ఇంకా పేరు పెట్టని ఈ సినిమా నాగచైతన్యకు తొలి తమిళ చిత్రం కాగా దర్శకుడు వెంకట్ ప్రభుకు మొదటి తెలుగు సినిమా. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా తన కుమారుడు యువన్ శంకర్ రాజాతో కలిసి సంగీతాన్ని సమకూర్చనుండటం విశేషం. ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ‘కార్తీక్ దీపం’ ఫేమ్ ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.