ఇప్పటివరకూ పాన్ ఇండియా హీరోగా ఉన్న ప్రభాస్ తో పాన్ వరల్డ్ సినిమా చేస్తామని వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ చెప్పినప్పుడు, అందరూ షాక్ అయ్యారు. పాన్ ఇండియానే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంటే, బాహుబలి ఇమేజ్ ఉన్న ప్రభాస్ తో కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న ‘నాగ్ అశ్విన్’ పాన్ వరల్డ్ సినిమా చెయ్యడం ఏంటి? అసలు అతను హ్యాండిల్ చెయ్యగలడా అనే అనుమానం అందరిలోనూ కలిగింది. మహానటి లాంటి క్లాసిక్ సినిమా తీసినా కూడా ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చెయ్యడం అనేది చాలా కష్టమైన పని. కథతో పాటు స్టార్ హీరో ఇమేజ్ ని కూడా దృష్టిలో పెట్టుకోని సినిమా చెయ్యాలి. ఈ విషయం చాలా బాగా తెలిసిన వాడు కాబట్టే నాగ్ అశ్విన్, ఇప్పటివరకూ ఉన్న కథతో… ఇప్పటివరకూ వాడిన ఎలిమెంట్స్ ని వాడకుండా సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. ‘ప్రాజెక్ట్ K’ సినిమా చెయ్యడానికే కష్టం అండి, ఈ సినిమా ఎలా వర్కౌట్ చెయ్యాలని అనే దానికే టైం ఎక్కువ పడుతుంది. మొత్తం స్క్రాచ్ నుంచి క్రియేట్ చెయ్యాలి అని చెప్పాడు. ఆ స్కార్చ్ అనే పదం నాగ్ అశ్విన్ నోటి నుంచి ఎప్పుడు బయటకి వచ్చిందో, అప్పటినుంచి అందరిలోనూ “నాగ్ అశ్విన్ ఎదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు” అనే ఫీలింగ్ కలిగింది.
నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తే సరిపోదు కదా… తను స్క్రాచ్ నుంచి ఎలాంటివి తయారు చేస్తున్నాడో? ఎంత శ్రద్ధగా తయారు చేస్తున్నాడో? టీం అంతా ‘ప్రాజెక్ట్ K’ కోసం ఎంత కష్టపడుతున్నారో ప్రేక్షకులకి కూడా తెలియాలి కదా అందుకే ‘ప్రాజెక్ట్ K’ నుంచి “రీఇన్వెంటింగ్ ది వీల్” అనే వీడియోని బయటకి వదిలారు. న్యూఇయర్ కానుకగా బయటకి వచ్చిన ఈ వీడియోలో నాగ్ అశ్విన్ అండ్ టీం… ఒక టైర్ ని తయారు చెయ్యడానికి ఎంత కష్టపడుతున్నారో చూపించారు. ఇప్పటివరకూ ఎక్కడా లేని ఒక టైర్ ని తయారు చెయ్యాలి అనేది నాగ్ అశ్విన్ ప్లాన్. ఆ ప్లాన్ ని వర్కౌట్ చెయ్యడానికి టీం అంతా ఎంత కష్టపడ్డారో ఈ వీడియోలో చూపించారు. ఈ ఒక్క వీడియో చాలు ‘ప్రాజెక్ట్ K’ పాన్ ఇండియా మాత్రమే కాదు పాన్ వరల్డ్ సినిమా అని చెప్పడానికి. ఇదంతా బాగానే ఉంది కానీ ఇంత కష్టపడీ నాగ్ అశ్విన్ అండ్ టీం తయారు చేసిన టైర్, ఏ బండికి వాడుతారు? అనేది తెరపైనే చూడాలి.