‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్, ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ జంటగా నటించిన సినిమా ‘రంగ రంగ వైభవంగా’. తమిళ దర్శకుడు గిరీశాయ ఈ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సోమవారం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మూవీ విడుదల తేదీని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తెలియచేస్తారని అంతా ఎదురుచూశారు. కానీ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అన్నట్టుగా నిర్మాత విడుదల తేదీని సస్పెన్స్ లో ఉంచేశారు. నిజానికి ‘రంగరంగ వైభవంగా’ మూవీ మే 27న విడుదల కావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో దాన్ని జూలై 1కి మార్చారు. అయితే… ఇప్పటి వరకూ చేసిన ప్రమోషన్స్ చాలవని భావించిన నిర్మాత ఇప్పుడీ సినిమాను జూలై 1న కూడా విడుదల చేయకుండా వాయిదా వేశారని తెలుస్తోంది. ఎందుకంటే అదే తేదీన వచ్చేవారైతే… ఈ రోజు ఆ డేట్ కే వస్తున్నామని ప్రకటించి ఉండేవారు. కానీ ఆ పని చేయలేదు. బట్… సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో ఓ వారం ఆగి జూలై 8న విడుదల చేయొచ్చనే మాట వినిపిస్తోంది.
‘రంగరంగ వైభవంగా’ సినిమా ముచ్చట ఇలా ఉంటే… దీని తర్వాత వైష్ణవ్ తేజ్ నటిస్తున్న నాలుగో సినిమా విడుదల తేదీ విషయంలోనూ కన్ ఫ్యూజన్ ఏర్పడింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, త్రివిక్రమ్ కు చెందిన ఫార్యూన్ 4 సినిమాస్ బ్యానర్ లో వైష్ణవ్ నాలుగో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ ఆ సందర్భంగా చెప్పారు. అయితే ఈ ప్రకటన వచ్చిన మర్నాడే మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో చేస్తున్న మూవీని కూడా సంక్రాంతికే విడుదల చేస్తున్న ప్రకటన వచ్చింది. సో… చిరంజీవి సినిమా మీద వైష్ణవ్ తేజ్ మూవీ వేయలేని పరిస్థితి. కాబట్టి ఇది సంక్రాంతికి ఓ వారం ముందుకో, వెనక్కో వెళుతుందన్నది ఫిల్మ్ నగర్ టాక్!