‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ వారం సీనియర్ మోస్ట్ యంగెస్ట్ సింగర్ మాళవిక, శ్రీకృష్ణ పాల్గొనడం ఓ విశేషం. తనకు చిన్నప్పటి నుండి శ్రీకృష్ణ, మాళవికతో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పాడు సాకేత్. అంతే కాదు… వేదిక మీదకు కృష్ణను అన్నయ్యా అనిపిలిచి, మాళవికను అత్తమ్మ అని సంభోదించాడు. అయితే… షో ప్రారంభానికి ముందే… ఆమె తనకు అత్తమ్మ ఎలా అయ్యిందో కూడా మాళవిక ద్వారానే చెప్పించాడు. చిన్నవయసులో ‘గంగోత్రి’ సినిమాకు పాట పడే నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడే రామాచారి గారిని తాను అన్నయ్య అని పిలిచానని, ఆ రకంగా ఆయన కొడుకైన సాకేత్ కు అత్తనే అవుతానని మాళవిక వివరణ ఇచ్చింది.
స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు, మధుర గాయని చిత్రతోనూ శ్రీకృష్ణ, మాళవికకు చక్కని అనుబంధం ఉంది. ఈ ఎపిసోడ్ లో ఆ అనుబంధాన్ని మరోసారి వీరిద్దరూ తలుచుకున్నారు. డెడికేషన్, డిసిప్లీన్, డౌన్ టూ ఎర్త్… ఈ మూడు లక్షణాలు వారిద్దరి దగ్గర నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని చెప్పారు. తాను విజయవాడలో ఉన్నప్పుడే మాళవిక ప్లే బ్యాక్ సింగర్ గా ఎంట్రీ ఇచ్చిందని, ఆమె పాటలు వింటూ ఉండేవాడినని, ఓసారి ఆమెను చూడటానికే విజయవాడ రైల్వేస్టేషన్ కు వెళ్ళానని శ్రీకృష్ణ చెప్పడం విశేషం. తామిద్దరూ కలిసి ఎన్నో స్టేజ్ షోస్ చేశామని, అలానే అనేక సార్లు విదేశాల్లోనూ పర్యటించామని అయితే… ఒకరిని ఒకరు ‘గారూ మీరూ’ అని పిలుచుకునే అలవాటు పోలేదని శ్రీకృష్ణ, మాళవిక చెప్పారు.
Read Also : Radhe Shyam : నెటిజన్లకు క్లాస్ పీకిన సినిమాటోగ్రాఫర్… విమర్శలపై ఫైర్
ఓకల్ సూపర్ వైజర్ గా శ్రీకృష్ణ!
శ్రీకృష్ణకున్న అలవాట్లలో వంట చేయడం ఒకటి. విజయవాడలో తమ ఇంటికి వచ్చే బంధుమిత్రులకు అమ్మతో కలిసి వంట చేసి పెట్టడం తనకు అలవాటుగా ఉండేదని, అదే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నానని శ్రీకృష్ణ చెప్పాడు. అంతేకాదు… సాకేత్ కోసం ప్రత్యేకంగా పచ్చిమిరపకాయ పచ్చడి చేసి తీసుకొచ్చాడు. ఇక ఓకల్ సూపర్ వైజర్ గా శ్రీకృష్ణ ఎంతోమంది గాయనీ గాయకులకు అవకాశం ఇప్పిస్తున్న విషయం సాకేత్ వ్యూవర్స్ కు తెలియచేశాడు. తమన్ దగ్గర ఓ పాట పాడే అవకాశం తనకు శ్రీకృష్ణే కల్పించాడని, నిజానికి శ్రీకృష్ణ తన ఆఫర్ ను వదులుకుని, తనను రిఫర్ చేశాడని సాకేత్ చెప్పాడు. ఓకల్ సూపర్ వైజర్ అనేది కోటి గారి చలవ వల్లే తనకు అబ్బిందని శ్రీకృష్ణ తెలిపాడు.
మణిశర్మకు పెట్టిన కాఫీ కథ!
లాస్ వెగాస్ వెళ్ళినప్పుడు రాత్రిళ్ళు గీతామాధురి, కారుణ్యతో కలిసి చేసిన చిలిపి పనుల గురించి మాళవిక కాస్తంత సిగ్గుపడుతూ చెప్పింది. కీరవాణి, మణిశర్మ గార్ల దగ్గర రికార్డింగ్స్ సమయంలో ఎలా మేనేజ్ చేసేదో తెలిపింది. ముందు ఎవరికి మాట ఇస్తే… వారికే ప్రాధాన్యం ఇచ్చేదాన్నని అందువల్ల కొన్ని మంచి పాటలు పాడలేకపోయానంటూ తన అశక్తతను తెలియచేసింది. మణిశర్మతో కలిసి విదేశాలలో షోస్ కు వెళ్ళినప్పటి ముచ్చట్లను మాళవిక ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది. ఓసారి ఆయన తనను, గీతామాధురిని కాఫీ పెట్టమని అడిగారని, అయితే కాఫీ పెట్టడం చేత కాక తాము ఏవేవో ప్రయోగాలు చేశామని, చివరకు అది ఎలా ఉందో మణిశర్మ గారిని అడిగే సాహసం కూడా చేయలేదని చెప్పింది.
ఫోటోస్ చూసి పాటలను గెస్ చేయడంలో మాళవిక మాస్టర్ అనిపించుకుంది. కరోనా సమయంలో తమ బంధువులంతా ఇదే తరహా పోటీలు పెట్టుకునే వాళ్ళమనే నిజాన్ని చెప్పేసింది. అలానే ర్యాపిడ్ ఫైర్ లోనూ పురాణాలకు, సైన్స్ కు సంబంధించిన ప్రశ్నలకు చక్కగా జవాబిచ్చింది. అంతేకాదు… బాలీవుడ్ కు ఐకాన్ గా నిలిచే షారూక్ ఖాన్ అంటే ఇష్టమని తెలిపింది. ఇక శ్రీకృష్ణ జనరల్ నాలెడ్జ్ లో తాను వీక్ అని ముందే చేతులెత్తేశాడు. తామిద్దరికీ ఓ ఈవెంట్ మేనేజర్ ‘ఫ్యామిలీ సింగర్స్’ అనే బిరుదు ఇచ్చాడని, దాన్ని తాను గౌరవంగా భావిస్తానని శ్రీకృష్ణ చెప్పడం విశేషం. ఈ సీనియర్ సింగర్స్ చెప్పిన బోలెడన్ని ఆసక్తికరమైన విశేషాలు చూడాలనుకుంటే… ఆలస్యం చేయకుండా ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి… ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ లేటెస్ట్ ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయండి!!