మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-4 అంటూ ఈరోజు సాయంత్రం ఓ వీడియోను విడుదల చేసింది. “ప్రపంచం మారవచ్చు. అభివృద్ధి చెందవచ్చు.. కానీ మేము ఎప్పటికీ మారము. మేము అందరం ఒక పెద్ద కుటుంబంలో భాగం” అంటూ ఈ వీడియోను షేర్ చేశారు మార్వెల్ సంస్థ వారు. అందులో గతంలో వచ్చిన సూపర్ హీరో చిత్రాలతో పాటు భవిష్యత్ లో రానున్న చిత్రాలకు సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. ‘ఎవెంజర్స్’ సిరీస్, ‘యాంట్ మ్యాన్’, ‘కెప్టెన్ అమెరికా’, ‘డాక్టర్ స్ట్రేంజ్’, ‘బ్లాక్ పాంథర్’, ‘కెప్టెన్ మార్వెల్’, ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ వంటి చిత్రాల విజువల్స్ తో పాటు స్కార్లెట్ జాన్సన్ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్లాక్ విడో’,’ షాంగ్-చి అండ్ ది లెజెండ్స్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ చిత్రాలకు సంబంధించిన స్నీక్ పీక్ లను ఈ వీడియోలో చూడొచ్చు. ఇక స్కార్లెట్, ఫ్లోరెన్స్ పగ్, రాచెల్ వీజ్, డేవిడ్ హార్బర్ నటించిన ‘బ్లాక్ విడో’ చిత్రం జూలై 9, 2021 న విడుదల కానుంది. ఈ చిత్రం ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్’ మరియు ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ సంఘటనల మధ్య సెట్ చేయబడింది. కాగా మొదటి ఆసియా సూపర్ హీరో చిత్రం ‘షాంగ్-చి మరియు ది లెజెండ్స్ ఆఫ్ ది టెన్ రింగ్స్’, సెప్టెంబర్ 3, 2021లో విడుదల కానుంది.