మంగళవారం పంపిణీదారులు, ప్రదర్శనదారులతో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చినట్లు మంత్రి తెలియచేశారు. చిత్రపరిశ్రమకు సబంధించిన పలు సంఘాల నుంచి తమకు విజ్ఞాపనలు వచ్చాయని, వాటన్నింటినీ ఇటీవల ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చించి సానుకూలంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు కూడా రేటు పెంచరా అని అడిగిన ప్రశ్నకు గత ప్రభుత్వంలా బామ్మర్దికి ఓ రూల్ ఇతరులుకు ఓ రూల్ ఉండదని, అందరికీ ఒకే రూల్ ఉంటుందన్నారు పేర్ని నాని. బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పన్ను రాయితీ కల్పించింది. అయితే అంతకు ముందు విడుదలైన గుణశేఖర్ ‘రుద్రమదేవి’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం రాయితీ ఇచ్చినా టిడిపి మాత్రం ఇవ్వలేదు. గుణశేఖర్ పదేపదే అడిగినా ఇవ్వలేదు. ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు మంత్రి నాని. ఇక హీరో సిద్ధార్థ్ ట్వీట్ ను మంత్రి దృష్టికి తీసుకురాగా… ఆయన ఉండేది చెన్నైలో… పన్ను కట్టేది కూడా అక్కడే. బహుశా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన మంత్రుల లగ్జరీ లైఫ్ గురించి సిద్ధార్థ్ ట్వీట్ చేసి ఉంటాడని మంత్రి నాని వ్యాఖ్యానించారు.