Megastar Chiranjeevi Responds On Garikipati Narasimha Rao Controversy: ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో ‘చిరంజీవి ఫోటో సెషన్ ఆపకపోతే నేను వెళ్లిపోతా’ అంటూ ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే! మెగాభిమానులతో పాటు కొందరు సినీ తారలు సైతం ఆయన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. మెగాబ్రదర్ నాగబాబు కూడా రంగంలోకి దిగి.. పరోక్షంగా గరికిపాటిపై చురకలు అంటించారు. ‘ఏ పాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్‌ని చూస్తే.. ఆపాటి అసూయ కలగడం పరిపాటే’నని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తనని తాను చిరంజీవికి వీరాభిమానినని చెప్పుకునే రాంగోపాల్ వర్మ సైతం ట్విటర్ మాధ్యమంగా ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాడు. గరికిపాటిని గడ్డిపరక అంటూ సెటైర్లు వేశాడు. చిరు జోలికొస్తే ఉపేక్షించేదే లేదని హెచ్చరించాడు కూడా. ఇలా ఈ వివాదం రోజురోజుకు వేడుక్కుతూనే ఉంది.
అయితే.. ఇంత జరుగుతున్నా, ఇప్పటిదాకా చిరంజీవి మాత్రం దీనిపై నోరు మెదపలేదు. అయితే.. తాజాగా తొలిసారి ఈ వివాదంపై ఆయన పెదవి విప్పారు. ‘‘ఆయన (గరికిపాటి నరసింహారావు) పెద్దాయన. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు’’ అని చెప్పారు. దీంతో.. ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలికినట్లయ్యింది. చూస్తుంటే.. అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికిపాటి చేసిన వ్యాఖ్యలను చిరంజీవి అసలు సీరియస్‌గా తీసుకోలేదని కనిపిస్తోంది. ఏదైతేనేం.. చిరు రెస్పాన్స్‌తో దీనికి చెక్ పడినట్లైంది. ఇక ఇదే సమయంలో.. ఆచార్య ఫ్లాప్ మీద చిరు మరోసారి రెస్పాండ్ అయ్యారు. తాము నటించే సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే, దాని పూర్తి బాధ్యత తామే తీసుకుంటామన్నారు. ‘ఆచార్య’ ఫ్లాప్ అయినందుకు తానేమీ బాధపడలేదని.. ఆ సినిమా పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని తాను, చరణ్ 80 శాతం పారితోషికాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశామని తెలిపారు.
అలాగే.. తాను రాజకీయాల్లో లేకపోవడం వల్ల బాగానే ఉన్నానని, ఒకవేళ ప్రజారాజ్యం పార్టీలో కొనసాగి ఉండుంటే తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక దానికే పరిమితం అయ్యేవాడినని చిరు అన్నారు. నటుడిగా గతంలో ఎలాంటి ఆదరణ ఉందో.. ఇప్పుడు కూడా అదే ఆదరణ తెలుగు రాష్ట్రాల్లో ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలన్నీ వచ్చే ఏడాది వేసవి నాటికి విడుదలవుతాయన్నారు. మార్చి నుంచి కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభిస్తానని.. బాబీ సినిమాలో తన రోల్ ఫుల్ మాస్ లుక్‌లో ఉంటుందని చెప్పారు. మోషన్ పోస్టర్‌ని దీపావళి రోజున విడుదల చేస్తామని చిరు స్పష్టం చేశారు.