‘మా’ ఎన్నికలు చర్చనీయాంశంగా మారడంతో ఎట్టకేలకు మెగాస్టార్ స్పందించారు. గతంలో ఎన్నడూ లేనంతగా మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీదారుల మధ్య చీలిక రావటం, ఎన్నడూ లేనంతగా పోటీదారుల సంఖ్య పెరుగుతుండటంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, బాలకృష్ణ, జీవిత, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ వ్యాఖ్యలతో ‘మా’ ఎన్నికలు వివాదంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ‘’మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు. మా ఎన్నికలు వెంటనే జరపాలి.. ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని లేఖలో తెలిపారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతోంది.. ‘మా’ ప్రతిష్ట దెబ్బతీస్తున్న ఎవర్నీ ఉపేక్షించవద్దని చిరంజీవి లేఖలో కృష్ణంరాజును కోరారు.

