‘ఆరడుగుల బుల్లెట్’ అంటూ పవన్ కళ్యాణ్ పై పాట రాశారు కానీ, వాళ్ళ కొణిదెల ఫ్యామిలీ స్టార్స్ లో ఆ మాటకు అసలు సిసలు నిర్వచనంగా నిలుస్తాడు వరుణ్ తేజ్. ఆరడుగుల పైన ఎత్తున్న వరుణ్ తేజ్ నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. చిరంజీవి పెద్ద తమ్ముడు నటుడు, నిర్మాత నాగబాబు కుమారునిగా ఆరంభంలో గుర్తింపు సంపాదించిన వరుణ్ తేజ్ ఇప్పుడు హీరోగా తన ఉనికిని చాటుకుంటున్నాడు.
వరుణ్ తేజ్ 1990 జనవరి 19న జన్మించాడు. చిన్నతనం నుంచీ చుట్టూ సినిమా వాతావరణమే! తండ్రి, పెదనాన్న, చిన్నాన్న అందరూ నటులే. దాంతో చిన్నతనంలోనే వరుణ్ కు కూడా నటించాలన్న అభిలాష సహజంగానే కలిగింది. బాలనటునిగా తండ్రి నటించిన ‘హ్యాండ్సప్’లో కనిపించాడు. 2014లో ‘ముకుంద’తో యంగ్ హీరోగా జనం ముందు నిలిచాడు వరుణ్ తేజ్. ‘ముకుంద’ చిత్రంలో వైవిధ్యం కనిపిస్తుంది. అయితే హీరో, హీరోయిన్ ఇద్దరి మధ్య మూగప్రేమ సాగడమే జనానికి అంతగా నచ్చలేదు. దాంతో ఆశించిన విజయం దక్కలేదు. తరువాత క్రిష్ దర్శకత్వంలో వరుణ్ నటించిన ‘కంచె’ నటునిగా మంచి మార్కులు సమకూర్చింది. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఆపై వచ్చిన ‘లోఫర్’, ‘మిస్టర్’ కూడా అంతగా ఆకట్టుకోలేక పోయాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన ‘ఫిదా’ నిజంగానే జనాన్ని ఫిదా చేసింది. ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. వరుణ్ తేజ్ కోరుకున్న విజయాన్ని అతనికి అందించింది. ‘ఫిదా’ పాటలు కూడా జనాన్ని కట్టిపడేశాయి. ఇందులోని పాటలు రికార్డు స్థాయిలోనూ జనాలను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా అందించిన సక్సెస్ తో వరుణ్ తేజ్ హుషారుగా ముందడుగు వేశాడు. తరువాత తన బాబాయ్ పవన్ కళ్యాణ్ టైటిల్ తో రూపొందిన ‘తొలి ప్రేమ’ కూడా వరుణ్ కు మంచి విజయాన్ని అందించింది. సైన్స్ ఫిక్షన్ గా వచ్చిన ‘అంతరిక్షం’ అంతగా మురిపించలేకపోయింది. ఆ తరువాత వెంకటేశ్ తో కలసి వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్-2’ అనూహ్య విజయం సాధించింది. ఈ చిత్రం తరువాత వచ్చిన ‘గద్దలకొండ గణేశ్’గానూ వరుణ్ మురిపించాడు.
కోవిడ్ కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో వరుణ్ తేజ్ నటించిన ఏ చిత్రమూ జనం ముందుకు రాలేదు. ప్రస్తుతం రెండు చిత్రాలలో నటించడానికి అంగీకరించాడు వరుణ్ తేజ్. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ‘ఘని’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ‘ఎఫ్-2’కు సీక్వెల్ గా రూపొందనున్న ‘ఎఫ్-3’లోనూ వరుణ్ తేజ్ మరోమారు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో అభినయిస్తున్నాడు. ప్రస్తుతానికి ‘ఘని’ మార్చి 18న రానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ జనాన్ని ఏ తీరున మురిపిస్తాడో చూడాలి.