Allari Naresh – Naga Chaitanya: మే నెల మాసం ఆ ఇద్దరు హీరోలకు బాగా కలిసొచ్చింది. ఒక్కొక్కరికి మూడు సినిమాలకు మించి విజయం లభించింది. కానీ ఈ యేడాదే తేడా కొట్టేసింది. కొన్ని నెలలు కొందరు హీరోలకు బాగా కలిసొస్తుందని అనుకుంటాం కానీ… కథలో దమ్ము, కథనంలో కొత్తదనం లేకపోతే… ఏ సెంటిమెంట్ కూడా సినిమాను విజయతీరాలకు చేర్చలేదని తేలిపోయింది. ఆ ఇద్దరు హీరోలు ‘అల్లరి’ నరేశ్… అక్కినేని నాగ చైతన్య. ఆ రెండు సినిమాలు ‘ఉగ్రం’, ‘కస్టడీ’! చిత్రం ఏమంటే… ఈ ఇద్దరు హీరోలు తమ చిత్రాలలో పోలీస్ ఆఫీసర్ పాత్రలే చేశారు. ‘అల్లరి’ నరేశ్ విషయానికే వస్తే… అతను నటించిన తొలి చిత్రం ‘అల్లరి’తో పాటు ‘కితకితలు’, ‘సీమటపాకాయ్’, ‘మహర్షి’ మే నెలలోనే విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ తాజా చిత్రం ‘ఉగ్రం’ మాత్రం నిరాశకు గురిచేసింది.
నరేశ్ మాదిరిగానే ఇప్పటి వరకూ మే నెల నాగచైతన్యకు కలిసొచ్చిందనే అక్కినేని అభిమానులు భావించారు. చైతు హీరోగా నటించిన ‘100 పర్సంట్ లవ్, తడాఖా, మనం, రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాలు మే నెలలోనే విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. కానీ ఆ మే సెంటిమెంట్ ‘కస్టడీ’కి ఉపయోగపడలేదు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. సో… ఓడలు బళ్ళు… బళ్ళు ఓడలు అవుతాయంటే ఇదే మరి!