Manjula Ghattamaneni: తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోస్ ఫ్యామిలీస్ నుండి అమ్మాయిలు నటించడం అన్నదానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే. ఆయన కూతురు భువనేశ్వరి (చంద్రబాబు నాయుడు భార్య) బాలనటిగా ‘మనుషుల్లో దేవుడు’ చిత్రంలో కాసేపు తెరపై శ్రీకృష్ణునిగా కనిపించారు. ఆ తరువాత ‘దానవీరశూర కర్ణ’ కోసం ఓ పాటను పురంధేశ్వరి, భువనేశ్వరిపై చిత్రీకరించినా, ఎందుకనో ఆ సాంగ్‌ను సినిమాలో తొలగించారు. ఎన్టీఆర్‌ను అనేక విషయాల్లో స్ఫూర్తిగా భావించే కృష్ణ సైతం తన రెండో కూతురు మంజులను బాలనటిగానటింప చేశారు. ఆ తరువాత మంజుల సినిమాలపై అభిలాషతో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సాగడం విశేషం.
మంజుల ఘట్టమనేని 1970 నవంబర్ 8న మద్రాసులో జన్మించారు. చిన్నతనం నుంచి చుట్టూ సినిమా వాతావరణం ఉండడంతో ఆమెలోనూ ఈ గ్లామర్ ఫీల్డ్‌పై ఆసక్తి కలిగింది. బాల్యంలోనే ‘శభాష్ గోపి’ అనే చిత్రంలో టైటిల్ రోల్ పోషించి అలరించారు మంజుల. ఆ తరువాత 1994లో బాలకృష్ణతో ఎస్వీ కృష్ణారెడ్డి ‘టాప్ హీరో’ రూపొందిస్తూ అందులో నాయికగా మంజులను ఎంచుకున్నారు. కానీ, కృష్ణ అభిమానులు తాము సోదరిగా భావించే మంజులను హీరోయిన్‌గా తెరపై చూడలేమని ఆందోళన చేశారు. వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ అప్పుడు మంజుల నటించడం విరమించుకున్నారు. అందువల్ల తొలుత మళయాళ చిత్రం ‘సమ్మర్ ఇన్ బెత్లేహామ్’లో నటించారు. ఆ తరువాత తమిళ చిత్రం ‘రాజస్థాన్’లో టెర్రరిస్ట్ షబనా పాత్రలో కనిపించారామె. అలా మొత్తానికి తనలో ఉన్న నటనాభిలాషను తీర్చుకున్నారు మంజుల. మూడేళ్ళ తరువాత తానే నిర్మాతగా మారి ‘షో’ అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో కేవలం రెండు పాత్రలతోనే కథ సాగడం విశేషం. ఓ పాత్రను కేరెక్టర్ యాక్టర్ సూర్య పోషించగా, మరో పాత్రలో మంజులనే నటించారు. ఈ సినిమాకు నీలకంఠ దర్శకత్వం వహించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘షో’ నిలిచింది. ఆ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే్కు మరో నేషనల్ అవార్డు లభించడం విశేషం.
తొలి చిత్రంతోనే నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్న మంజుల, తరువాత తమ్ముడు మహేష్ బాబు హీరోగా ‘నాని’ అనే సినిమాను నిర్మించారు. ఆ తరువాత పూరి జగన్నాథ్‌తో కలసి ‘పోకిరి’ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ‘పోకిరి’ మహేష్‌బాబుకు తరిగిపోని చెరిగిపోని రికార్డులు అందించింది. తరువాత ‘కావ్యాస్ డైరీ’లో నటిస్తూ ఆ చిత్రాన్ని నిర్మించారు మంజుల. నాగచైతన్య, సమంత తొలి చిత్రం ‘ఏ మాయ చేశావె’ మూవీని కూడా నిర్మించారామె. తరువాత మెగాఫోన్ పట్టి ‘మనసుకు నచ్చింది’ చిత్రాన్ని రూపొందించారు. ‘ఆరెంజ్, సేవకుడు, మళ్ళీ మొదలైంది’ వంటి చిత్రాలలో నటించి అలరించిన మంజుల ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలు నచ్చితే నటించడానికి సిద్ధంగా ఉన్నారు. మంజుల భర్త సంజయ్ స్వరూప్ ఆమె నిర్మించిన చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు. ఆయన కూడా కేరెక్టర్ యాక్టర్‌గా సాగుతున్నారు. ‘ఆరెంజ్’ వంటి చిత్రాలలో భర్తకు జోడీగానే మంజుల నటించారు. మంజుల, సంజయ్ కలసి మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. ఏది ఏమైనా తండ్రి కృష్ణ బాటలో పయనిస్తూ మంజుల నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సాగడం విశేషం. ఈ తరహాలో టాలీవుడ్ స్టార్ హీరోస్ ఫ్యామిలీ నుండి మహిళలు అలరించడం అరుదనే చెప్పాలి. అలా తనదైన పంథాలో ప్రత్యేకంగా సాగుతున్న మంజుల మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.
(నవంబర్ 8న మంజుల ఘట్టమనేని బర్త్ డే)