Manjima Mohan: కోలీవుడ్ స్టార్ జంట గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటైన సంగతి తెల్సిందే. మూడురోజుల క్రితం వారి పెళ్లి కేరళలోని ఒక కల్యాణమండపంలో అంగరంగ వైభవంగా జరిగింది. మూడేళ్ళ ప్రేమ బంధానికి పెళ్లితో ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక పెళ్లి తరువాత నవవధువు మంజిమా మోహన్ ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది. పెళ్ళికి వచ్చిన అతిధులు ఎవరైనా పెళ్ళికొడుకు, పెళ్లికూతురు గురించి మాట్లాడుకోవడం సహజం. జంట చూడముచ్చటగా ఉందని, ఇద్దరికీ సరిపోయిందని లాంటి మాటలు పెళ్ళిలో వింటూనే ఉంటాం. అయితే మంజిమా పెళ్ళిలో అతిధులు మాత్రం మంజిమాను బాడీ షేమింగ్ చేశారట. మంజిమా బొద్దుగా ఉండడంతో మొదటి నుంచి ఆమెపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.
హీరోయిన్ గా పనికిరాదు అని, ఆంటీలా ఉన్నావని కామెంట్స్ చేస్తూ వచ్చారు. చివరికి పెళ్ళిలో కూడా ఆమె బాడీ షేమింగ్ ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. “నా పెళ్ళికి వచ్చిన అతిధులు ఫోటోలు దిగడానికి స్టేజిమీదకు వచ్చి కొంచెం బరువు తగ్గొచ్చుగా అని సలహాలు ఇచ్చారు. గౌతమ్ కన్నా ఎక్కువ బొద్దుగా కనిపిస్తున్నాను, చూడడానికి బాగాలేదు అన్నట్లుగా మాట్లాడారు. నేను అంతకు ముందు ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నాను. కానీ నా పెళ్ళిలో కూడా ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు విని చాలా బాధపడ్డాను. నేను ఎప్పుడు బరువు తగ్గాలి అనేది నాకు బాగా తెలుసు. అయినా మగవారు ఎలా ఉన్నా పట్టించుకోని సమాజం.. ఆడవారు ఇలాగే ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు అనేది తెలియడం లేదు”అని వాపోయింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.