Mani Ratnam : దర్శక’మణి’రత్నం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం తనకంటూ ఓ స్థానం సంపాదించారు. అంతర్జాతీయ వేదికలపై సైతం మణిరత్నం హవా విశేషంగా వీచింది. ఇంతకూ మణిరత్నంలో అంత గొప్పతనం ఏముందబ్బా? అంటూ ఎకసెక్కేలు చేసేవారు ఉన్నారు. ఎందుకంటే చాలా రోజులుగా మణిరత్నం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటలేకపోతున్నాయి. పైగా ఆయన నుండి వస్తున్న చిత్రాలలోనూ పాతకథలే కనిపించాయి. దాంతో ఈ తరం జనం మణి సినిమాలను అంతగా పట్టించుకోవడం లేదు. అందువల్ల నవతరం ప్రేక్షకులకు మణిరత్నం చిత్రాల్లోని గొప్పతనమూ అర్థం కాదు. ఈ రోజు కాకపోయినా, మరో నాడయినా సినిమాలపై మోజున్న నవతరం ఖచ్చితంగా మణిరత్నం చిత్రాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. సినిమా కూడా ఓ కళ, దానికీ కొన్ని నిర్దుష్టమైన సూత్రాలు ఉంటాయి. వాటిని అనుసరిస్తూ సినిమాలను తెరకెక్కించిన వారి కళ ప్రపంచంలోని నలుమూలల ఉన్న సినీప్రియులకు అర్థమవుతుంది. పాత సూత్రాలను తోసిరాజని, కొత్త సూత్రాలను రూపకల్పన చేసినప్పుడూ ‘అద్భుతం’ అనిపిస్తుంది. మణిరత్నం సినిమాల్లో గ్లామర్ తో పాటు గ్రామరూ ఉండేది. అందుకే సినిమా పరిజ్ఞానం ఉన్న అందరికీ మణి చిత్రాల్లోని గ్రామర్ అర్థమయ్యేది, అందులోని గ్లామరూ ఆకట్టుకొనేది.
గోపాలరత్నం సుబ్రమణ్యం 1956 జూన్ 2న మధురైలో జన్మించారు. ఆయన తండ్రి ఎస్.గోపాలరత్నం వీనస్ పిక్చర్స్ కు పంపిణీదారుడుగా ఉండేవారు. మణిరత్నం సమీపబంధువులదే వీనస్ సంస్థ. చిత్రసీమతో గోపాలరత్నంకు నేరుగా సంబంధాలు ఉన్నా, చిన్నతనంలో మణిరత్నంకు సినిమాలంటే అంత ఆసక్తి ఉండేది కాదు. అలాంటి మణిరత్నం మనసులో సినిమా నాట్యం చేసింది ఆయన హైస్కూల్ లో చదువుకొనే రోజుల్లో. నటులు శివాజీగణేశన్, నగేశ్ ఆయన అభిమానులు. ఇక కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన సినిమాలంటే మణి పరుగులు తీసేవారు. అలా మణిరత్నం అభిలాషకు అన్న వెంకటేశ్వరన్, తమ్ముడు శ్రీనివాసన్ కూడా ప్రోత్సాహం అందించారు. చదువు పూర్తి కాగానే తొలుత కన్నడ చిత్రం ‘పల్లవి- అనుపల్లవి’, ఆ పై మళయాళ చిత్రం ‘ఉనరు’, తరువాత తమిళ చిత్రాలు “పగల్ నిలవు, ఉదయ్ కోవిల్” రూపొందించారు. ఏదీ కమర్షియల్ గా ఆనందం పంచలేక పోయింది. మణి రూపొందించిన ఐదో చిత్రం ‘మౌనరాగం’ విజయఢంకా మోగించింది. తెలుగులో అనువాదమై అలరించింది. ఆ తరువాత నుంచీ మణిరత్నం రూపొందించిన చిత్రాలన్నీ తెలుగులోనూ అనువాదాల రూపంలో వెలుగు చూడడం మొదలయింది. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఒకే ఒక్క తెలుగు చిత్రం ‘గీతాంజలి’. ఈ చిత్రం తెలుగునాట మంచి విజయం సాధించినప్పటికీ, ఎంతోమంది ప్రముఖ నిర్మాతలు మణిరత్నంను తమకు తెలుగులో సినిమాలు తీసిపెట్టమని వెంటపడ్డా కూడా, మణి దొరకలేదు.
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేరియో ప్యూజో రాసిన ‘గాడ్ ఫాదర్’ ఆధారంగా ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా రూపొందించిన ‘గాడ్ ఫాదర్’ ట్రయాలజీ సినీ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘గాడ్ ఫాదర్’ తొలి రెండు భాగాలు ఎంతగానో మురిపించాయి. ఈ చిత్రాలను అధ్యయనం చేసి, దర్శకత్వంలో రాణించిన వారు ఎందరో ఉన్నారు. వారిలో మణిరత్నం కూడా నేనూ ఉన్నానని చాటుకున్నారు. ‘గాడ్ ఫాదర్’ స్ఫూర్తితో మణిరత్నం తెరకెక్కించిన ‘నాయకన్’ చిత్రం ‘టైమ్ మేగజైన్’ ఎంపిక చేసిన టాప్ 100 మూవీస్ లో చోటు చేసుకుంది.
‘టైమ్ -100’లో మణిరత్నం ‘నాయకన్’ చిత్రం చూసిన అమెరికన్లు సైతం ఆ సినిమా గాడ్ ఫాదర్ ఇన్ స్పిరేషన్ తో రూపొందిందంటే నమ్మలేక పోయారు. ‘గాడ్ ఫాదర్’ స్ఫూర్తితోనే హిందీలో ‘ధర్మాత్మ’ చిత్రాన్ని రూపొందించి, అందులో నటించి ఘనవిజయం సాధించిన ఫిరోజ్ ఖాన్ కూడా ‘నాయకన్’ చూసి ఫిదా అయిపోయారు. ‘నాయకన్’ను ‘దయవాన్’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అది వేరే విషయం. మణి రూపొందించిన ‘రోజా, బొంబాయి, దిల్ సే’ చిత్రాలు ‘టెర్రరిజమ్ ట్రయాలజీ’గా పేరొందాయి. అంతర్జాతీయ యవనికలపైనా, ఆ చిత్రాల్లోని కథాంశం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలను చూసిన విదేశీయులు సైతం మణిరత్నం చిత్రాలను అధ్యయనం చేసి, కితాబు నిచ్చారు.
మణి చిత్రాల ద్వారా ఎందరో చిత్రసీమలో వెలుగులు చూశారు. మణి ‘మౌనరాగం’తోనే కార్తిక్, రేవతి స్టార్ డమ్ అందుకున్నారు. ‘అగ్నినచ్చత్రం’తో ప్రభు, అమల స్టార్ డమ్ చేజిక్కించుకోగా, నిరోషాకు ఆ సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. రజనీకాంత్ ‘దళపతి’లో ఓ కీలక పాత్రలో కనిపించిన అరవింద స్వామి, మణి ‘రోజా’తో పాపులర్ స్టార్ అయిపోయాడు. ఇదే ‘రోజా’తో సంగీత దర్శకునిగా పరిచయమైన ఎ.ఆర్.రహమాన్ ఆ తరువాత మణి చిత్రాలతోనే తనదైన బాణీ పలికించాడు. ఈ రోజున రహమాన్ ఏ స్థాయిలో ఉన్నాడో అందరికీ తెలుసు. అప్పటి నుంచీ మణి సినిమాల్లో ఓ చిన్న రోల్ చేసినా చాలు అని అందరూ ఆశించేవారు. మణి ‘ఇరువర్’తోనే ఐశ్వర్యారాయ్ తెరంగేట్రం చేసింది. మణి సినిమాలతోనే పి.సి.శ్రీరామ్, సంతోష్ శివన్, రాజీవ్ మీనన్, రవి కె.చంద్రన్ వంటి సినిమాటోగ్రాఫర్స్ కు ఎనలేని పేరు లభించింది. ఇలా చెప్పుకుంటూ పోతే మణి చిత్రాల ద్వారా చిత్రసీమలో వెలుగు చూసిన వారి జాబితా పెరుగుతూ పోతుంది. ఈ తరం ప్రేక్షకులకు మణిరత్నం గొప్పతనం అంతగా తెలియక పోయినా, ఆయన చిత్రాలను అధ్యయనం చేసిన రోజున మణి ప్రతిభకు అప్రతిభులు కాకమానరు. చారిత్రక నేపథ్యంలో మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’తో ఆయన మరోమారు తనదైన బాణీ పలికిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఫ్యాన్స్ అభిలాషను మణి ఏ మేరకు నెరవేరుస్తారో చూడాలి.
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!