Manchu Vishnu Gives Interesting Updates About Dhee 2: మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘జిన్నా’. ఈ సినిమా ఈ నెల 21న జనం ముందుకు వస్తోంది. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని ఈషాన్ సూర్య డైరెక్ట్ చేశాడు. సినిమా విడుదల సందర్భంగా మంచు విష్ణు మీడియాతో ముచ్చటించారు. ముందుగా ఈ సినిమా టైటిల్ పై వచ్చిన కాంట్రవర్శీ గురించి వివరణ ఇస్తూ, ”ఇందులో హీరో పేరు గాలి నాగేశ్వరరావు. అలా పిలిపించుకోవడం అతనికిష్టం ఉండదు. జిన్నా అని పిలవమని ఫ్రెండ్స్ కు చెబుతాడు. గాలి నాగేశ్వరరావుకు ఇంగ్లీష్ లో షార్ట్ కట్ ‘జి.నా.’. అలా అంటే బాగోదని ‘జిన్నా’ అనే పేరు పెట్టాం. కొందరు దాన్ని వివాదం చేశారు. అదీ మా మంచికే అనుకున్నాను. కానీ మనసులో ఎలాంటి దురుద్దేశ్యం లేదు. అందుకే ఆ పేరుతోనే ముందుకు వెళ్ళిపోయాం. సినిమా చూసిన తర్వాత ఎవరూ ఈ పేరు పెట్టినందుకు విమర్శించరనే అనుకుంటున్నాను” అని అన్నారు.
ఈ సినిమాను మోహన్ బాబు ‘ఢీ’తో పోల్చడంపై విష్ణు మాట్లాడుతూ, ”నాన్నగారికి సినిమా బాగా నచ్చింది. ‘ఢీ’ మూవీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్. అయితే ఇందులో ప్రేక్షకుల ఊహకందని అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఆడియెన్స్ ను షాక్ కు గురి చేస్తుంది. అలానే క్లయిమాక్స్ డిఫరెంట్ గా ఉంటుంది. దాంతో ‘ఢీ’తో నాన్న గారు దీన్ని పోల్చారు. ఆ స్థాయి విజయం అందుకుంటుందో లేదో నేను ఇప్పుడే చెప్పలేను. కానీ ఈ సినిమా ప్రివ్యూ వేసినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ పడిపడి నవ్వారు. రేపు ఆడియెన్స్ కూడా అలానే ఫీల్ అవుతారనే నమ్మకం ఉంది” అని అన్నారు.
‘జిన్నా’ను ఈషాన్ సూర్య డైరెక్షన్ లో చేయడానికి కారణం చెబుతూ, ”మూల కథ ప్రముఖ దర్శకులు జి. నాగేశ్వరరెడ్డి గారిది. కోన వెంకట్ దీన్ని పూర్తిస్థాయిలో రెడీ చేశారు. సన్నీ లియోన్ డేట్స్ లాక్ చేసుకుని నా వద్దకు వచ్చారు. అయితే ఆమె తెలుగులో అంత పాపులర్ కాదు కదా? అని అనుకున్నా. నాన్నగారు కథ బాగుంది, చేయమని అన్నారు. అప్పుడు ఓ మీడియా ఫ్రెండ్‌ను కూడా సలహా అడిగాను. సన్నీ లియోన్ అయితే బాగుంటుందని అన్నారు. అలా ఈ సినిమాలోకి సన్నీ లియోన్ వచ్చారు. ఆమెకు నటిగా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. దర్శకత్వం విషయానికి వస్తే, జి. నాగేశ్వరరెడ్డి గారు ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల శ్రీను వైట్ల అసిస్టెంట్ సూర్యను డైరెక్టర్‌గా తీసుకున్నాం. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. ఎంతో కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఈ మూవీకి ఎంత పెద్ద విజయం చేకూరుతుందో తెలియదు గానీ మనిషిగా ఆయన ఎంతో మంచి వ్యక్తి” అని అన్నారు. ‘జిన్నా’ మ్యూజిక్ ఆల్బమ్ తనకు ఎంతో ప్రత్యేకమైందని, ఇందులో తన కుమార్తెలు అరియానా, వివియానా పాట పాడారని, మొదట సందేహించినా, అనూప్ రూబెన్స్ రికార్డింగ్ తర్వాత ఎంతో సంతోషించి, అభినందించాడని విష్ణు చెప్పారు. ఇందులో తాను పోషించిన జిన్నా క్యారెక్టర్ చిత్తూరుకు చెందిందని, ఆ యాస మాట్లాడటానికి కాస్తంత ఇబ్బంది పడ్డానని, ప్రాక్టీస్ చేసి డైలాగ్స్ చెప్పానని తెలిపారు.
ఇప్పటికే ప్రకటించిన ‘ఢీ -2’ మూవీ ఖచ్చితంగా ఉంటుందని, శ్రీను వైట్ల దర్శకత్వంలోనే దాన్ని వచ్చే యేడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభిస్తానని అన్నారు. అలానే వివిధ భాషలకు చెందిన పలు చిత్రాల రీమేక్ రైట్స్ తాను తీసుకున్నానని, అందులో మలయాళ చిత్రం ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్’ను తన తండ్రితో తెలుగు నేటివిటీలో రీమేక్ చేయబోతున్నానని మంచు విష్ణు చెప్పారు.