సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విషయంలో అయినా, యాడ్స్ తో పాటు బుల్లితెర షోలు అయినా అన్స్టాపబుల్ అన్నట్టుగా దూసుకెళ్తున్నారు. వెండితెర ప్రిన్స్ మహేష్ ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాలలో కనిపించడానికి కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఒకవైపు బాలయ్యతో “అన్స్టాపబుల్” అంటూనే, మరోవైపు ఎన్టీఆర్ తో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ద్వారా నెక్స్ట్ లెవెల్ ఎంటెర్టైన్మెంట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు సంబంధించిన ప్రత్యేక ఎపిసోడ్ డిసెంబర్ 5న జెమినీ టీవీలో ప్రీమియర్ కానుంది.

ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో పాపులర్ సెలెబ్రిటీ టాక్ షో “అన్స్టాపబుల్”లో కూడా సందడి చేయనున్నారు. మహేష్, బాలయ్యల ప్రత్యేక ఎపిసోడ్ ను నిన్న షూట్ చేశారు. “ఆహా”లో ప్రసారం అవుతున్న టాక్ షో “అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే” ఇప్పటి వరకూ 3 ఎపిసోడ్ లే రాగా, బుల్లితెర వీక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ క్రెడిట్ మొత్తం హోస్ట్ నందమూరి బాలకృష్ణకే చెందుతుంది. అతిథులతో ఆయన చమత్కారమైన, ఫన్నీ ఇంటరాక్షన్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించేలా చేస్తోంది.
Read Also : అమెరికాలో ఊర”నాటు” రచ్చ… ఖండాలు దాటిన ‘ఆర్ఆర్ఆర్’ సాంగ్ క్రేజ్
ఇప్పటి వరకు ఈ షోలో సినీ నటులు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి కనిపించారు. ఇప్పుడు వీరికి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తోడయ్యాడు. తాజాగా ఎన్బికెతో “అన్స్టాపబుల్ షూటింగ్ సమయంలో బాలకృష్ణతో కలిసి ఉన్న ఫోటోను మహేష్ పంచుకున్నారు. “నా సాయంత్రాన్ని ఎన్బీకే గారితో ‘అన్స్టాపబుల్’గా ఆనందించాను” అంటూ చెప్పుకొచ్చారు. నిన్నటితో షూటింగ్ పూర్తయింది. ఇది 4వ ఎపిసోడ్ గా ప్రసారం అవుతుందా ? లేదా అనేది షో నిర్వాహకులు ప్రకటించాల్సి ఉంది. అంతేకాకుండా ఈ ఎపిసోడ్ ని చూసేందుకు ఇరువురు నటుల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ అన్స్టాపబుల్ ఎపిసోడ్ ఈ నెలాఖరున విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇక మొత్తానికి బాలయ్య, ఎన్టీఆర్ తో కలిసి మహేష్ బాబు సందడి చేయడం ఇటు నందమూరి అభిమానులకు, అటు సూపర్ స్టార్ అభిమానులకు కూడా సంతోషాన్ని కలిగించే విషయం. బాలయ్య, ఎన్టీఆర్ సైతం తమ తోటి సెలెబ్రిటీలతో ఇంటరాక్ట్ అయ్యే ఈ విధానం బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోందనే చెప్పాలి. బాబాయ్, అబ్బాయ్ లతో మహేష్ కలిస్తే ఎంటెర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.