సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్క హీరోగా నటిస్తూనే మరోపక్క నిర్మాణ రంగంలో కూడా విజయాలను అందుకుంటున్న విషయం విదితమే. GMB ఎంటర్టైన్మెంట్ పేరుతో పలు నిర్మిస్తున్న మహేష్ A+S మూవీస్ , సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థతో కలిసి ‘మేజర్’ సినిమాను నిర్మించిన విషయం విదితమే. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు రిలీజ్ చేసిన సంగతి విదితమే. ఈ ట్రైలర్ లాంచ్ లో మహేష్, కృష్ణ గారి బయోపిక్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఈవెంట్ లో ఒక రిపోర్టర్ మహేష్ ను ఒక ప్రశ్న అడిగారు. “మహేష్ గారు.. నేను ఇటీవలే అమలాపురం వెళ్లాను . అక్కడ ఒక జాతర జరుగుతోంది. ఒకపక్క అమ్మవారి విగ్రహాలు.. ఇంకోపక్క వారి చేతుల్లో మహేష్ బాబు ఫోటోలు. నేను వెళ్లి వారిని అడిగాను. మహేష్ బాబు ఫోటోలు ఎందుకు పట్టుకున్నారు అని.. అమ్మవారు మాకు దేవత.. మహేష్ బాబు మాకు దేవుడు అంటూ చెప్పుకొచ్చారు. అలాంటి అభిమానం మీకు సొంతం.. మరి అలాంటి అభిమానులకు కృష్ణ గారి బయోపిక్ ఎప్పుడు అందిస్తారు” అని అడుగగా మహేష్ సమాధానమిస్తూ.. ” కృష్ణ గారి బయోపిక్ ఎవరైనా తీస్తే మొదటగా నేను చూసి సంతోషిస్తా.. కానీ, నేను నాన్న బయోపిక్ తీయను, అయన నా దేవుడు.. అవసరం అయితే ప్రొడ్యూస్ చేస్తా” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.