అక్టోబర్ 22వ తేదీ నుండి మహారాష్ట్రలోనూ సినిమా హాల్స్, ఆడిటోరియమ్స్ ను తెరవబోతున్నారు. అయితే సినిమా థియేటర్లు, ఆడిటోయంలలో కేవలం సిట్టింగ్ కెపాసిటీలో యాభై శాతానికి మాత్రమే ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. మంగళ వారం మహారాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ)ని విడుదల చేసింది. 2020 మార్చిలో సినిమా థియేటర్లను కరోనా కారణంగా మూసివేశారు. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్ మాసాలలో దేశంలోని కొన్ని ప్రాంతాలలో థియేటర్లను పాక్షికంగా తెరిచారు. కానీ కరోనా తీవ్రత మహారాష్ట్రలో మాత్రం తగ్గలేదు. దాంతో వాటికి అనుమతి లభించలేదు.
Read Also : ‘జై బాలయ్య’ అంటున్న గోపీచంద్ మలినేని
గడిచిన 17 నెలలలో అత్యల్పంగా సోమవారం కేవలం 1, 736 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అలానే 36 మరణాలు సంభవించాయి. ఇంతవరకూ మహారాష్ట్రలో 65, 79, 608 కరోనా కేసులు నమోదు కాగా 1, 39, 578 మంది కన్నుమూశారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని గైడ్ లైన్స్ తో థియేటర్లను పునః ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. థియేటర్ సిబ్బందితో పాటు ప్రేక్షకులు సైతం రెండు డోసుల వాక్సినేషన్ వేసుకోవాలని, ఆరోగ్య సేతు యాప్ లో సురక్షితం అనే స్టేటస్ ఉండాలని, టిక్కెట్, ఆహార పదార్థాలను థియేటర్లలో ఆన్ లైన్ ద్వారానే కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. అలానే ఎక్కవ మంది ఒకచోట గుమిగూడకుండా మల్టిప్లెక్స్ షోస్ టైమింగ్ ను మార్చాలని తెలిపింది. మరి థియేటర్లలో సినిమా చూడటానికి తహతహలాడుతున్న మహారాష్ట్ర వాసులు రాబోయే చిత్రాలను ఏమేరకు ఆదరిస్తారో చూడాలి.