(డిసెంబర్ 6న సావిత్రి జయంతి)
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావులోని అసలైన నటుణ్ణి వెలికి తీసిన చిత్రం దేవదాసు
(1953). ఈ చిత్రంలో దేవదాసు పాత్రతో పోటీ పడి పార్వతి పాత్రలో జీవించారు సావిత్రి. అంతకు ముందు 1950లో ఏయన్నార్ ను టీజ్ చేస్తూ సంసారం
చిత్రంలో ఓ పాటలో తళుక్కుమన్నారు సావిత్రి. ఆ తరువాత అదే ఏయన్నార్ కు సావిత్రి విజయనాయికగా మారడం విశేషం! సావిత్రితో ఏయన్నార్ నటించిన తొలి చిత్రం దేవదాసు
. అయితే దాని కంటే ముందుగా విడుదలయిన చిత్రం పి.రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రతుకు తెరువు
. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ఆ తరువాత వచ్చిన విషాదాంత ప్రేమగాథ దేవదాసు
ఇద్దరికీ నటీనటులుగా మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాదించడంతో తరువాత ఏయన్నార్, సావిత్రి జోడీగా నటించిన అనేక చిత్రాలు ద్విభాషల్లోనూ అలరించాయి.
విజయనాయిక
నిస్సందేహంగా ఏయన్నార్ విజయనాయికల్లో సావిత్రి అందరికంటే ముందు స్థానం ఆక్రమిస్తారు. అక్కినేనితో సావిత్రి జంటగా నటించిన అర్ధాంగి, సంతానం, దొంగరాముడు, భలే రాముడు, చరణదాసి, తోడికోడళ్ళు, మాయాబజార్, మాంగల్యబలం, నమ్మిన బంటు, అభిమానం, వెలుగునీడలు, ఆరాధన, మంచిమనసులు, మూగమనసులు, సిరిసంపదలు, సుమంగళి
వంటి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. వీటిలో అనేక చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా వారిద్దరూ జంటగా నటించినమంచిమనసులు, మూగమనసులు
బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం విశేషం. మరికొన్ని చిత్రాలలోనూ సావిత్రితో ఏయన్నార్ కలసి నటించినా, సదరు సినిమాల్లో ఇతరులతో ఆమె జోడీ కట్టడం గమనార్హం!
స్ఫూర్తి…
దుక్కిపాటి మధుసూదనరావు, ఏయన్నార్ ను ఛైర్మన్ గా పెట్టి, తాను మేనేజింగ్ డైరెక్టర్ గా అన్నపూర్ణ పిక్చర్స్
సంస్తను స్థాపించారు. తొలి ప్రయత్నంగా కేవీ రెడ్డి దర్శకత్వంలో దొంగరాముడు
(1955) నిర్మించారు. అందులో సావిత్రి నాయిక. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు, మాంగల్యబలం, వెలుగునీడలు, సుమంగళి, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు
చిత్రాలలో సావిత్రి నాయికగా నటించారు. ఈ చిత్రాలలో ఒకటి మినహాయిస్తే అన్నీ మంచి విజయం సాదించడం విశేషం! ఇక ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు చిత్రసీమలో అడుగుపెట్టడానికి ప్రేరణగా నిలచిన చిత్రం నమ్మినబంటు
. ఈ సినిమా షూటింగ్ రామానాయుడు స్వస్థలం కారంచేడులో జరుగుతున్న సమయంలోనే ఏయన్నార్, సావిత్రి తదితరులకు రామానాయుడు సహాయసహకారాలు అందించారు. అందుకు కారణం, ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన యార్లగడ్డ శంభుప్రసాద్ , రామానాయుడుకు సమీపబంధువు. అప్పటికే సావిత్రి మహానటిగా జేజేలు అందుకుంటున్నారు. ఆమెను దగ్గరగా చూసిన జనం పులకరించి పోయారు. రామానాయుడును కొందరు చిత్రసీమకు వస్తే మీరూ రాణిస్తారని అప్పుడే చెప్పడం జరిగింది. ఆ తరువాత నమ్మినబంటు
విడుదలై ఘనవిజయం సాధించింది. దాంతో నాయుడుకు కూడా చిత్రసీమపై ఆసక్తి కలిగింది. ఇలా తాను సినిమారంగంలో ప్రవేశించడానికి పరోక్షంగా ఏయన్నార్, సావిత్రి కారణమని నాయుడు చెప్పుకొనేవారు.
మూగమనసులు
తరువాత సావిత్రి, ఏయన్నార్ జోడీ మెల్లగా జనాన్ని ఆకట్టుకోలేక పోయాయి. ఆ తరువాత వారిద్దరూ నటించిన చిత్రాలలో మనసులు-మమతలు, మనసే మందిరం
వంటి చిత్రాలలో ఆమె జగ్గయ్య జోడీగా కనిపించారు. అయితే ఏయన్నార్ తొమ్మిది పాత్రల్లో కనిపించిన నవరాత్రి
లో మాత్రం సావిత్రినే నాయికగా నటించారు. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఏయన్నార్, సావిత్రి జంటగా కనిపించిన చివరి చిత్రం ప్రాణమిత్రులు
. అది పరాజయం పాలయింది. ఆ తరువాత అక్కినేని, సావిత్రి జంట మళ్ళీ జోడీగా కనిపించలేదు. అక్కినేని, ఆదుర్తి సంయుక్తంగా నిర్మించిన మరో ప్రపంచం
లో ఓ కీలక పాత్రలో నటించారు సావిత్రి. 1978లో దాసరి నారాయణరావు తెరకెక్కించిన దేవదాసు మళ్ళీ పుట్టాడు
లో వయసు మళ్ళిన పార్వతి పాత్రలో కాసేపు తెరపై కనిపించారామె.
ఏది ఏమైనా, నటసమ్రాట్ పలు చిత్రాలలో నాయికగా నటించి, జయకేతనం ఎగురవేశారు నటీశిరోమణి సావిత్రి. ఆ స్థాయిలో ఏయన్నార్ సరసన విజయాలు అందుకున్న నాయిక మరొకరు కానరారు.