Maa Annayya Serial Produced by Mythri Movie Makers to Telecast in Zee Telugu: ఆసక్తికరమైన మలుపులు, ఆకట్టుకునే కథలతో సాగే సీరియల్స్ను అందిస్తున్న జీ తెలుగు మరో సరికొత్త సీరియల్ తన అభిమాన వీక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం, కుటుంబ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ, కథనంతో రూపొందుతున్న సరికొత్త సీరియల్ ‘మా అన్నయ్య’. ఈ సీరియల్లో అన్నాచెల్లెళ్ల మధ్యనున్న అనుబంధం, ప్రేమ, బాధ్యతలు, అనురాగాలను కొత్త కోణంలో చూపించనున్నారు. మా అన్నయ్య సీరియల్ కథ గంగాధర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ప్రముఖ నటుడు గోకుల్ మీనన్ గంగాధర్ పాత్రలో కనిపించనున్నారు. రాధమ్మ కూతురులో అరవింద్ పాత్రను పోషించడం ద్వారా విజయవంతంగా తన స్టార్ పవర్‌ని స్థాపించుకున్నారు. చిన్న వయసు నుంచే తన చెల్లెళ్ల బాగోగులు చూసుకునే బాధ్యతను తీసుకున్న ఒక అన్నయ్య కథే మా అన్నయ్య. గంగాధర్ తండ్రి మల్లికార్జున్ (ఉదయ్) బాధ్యతారాహిత్యంగా తాగుడుకు బానిస కావడంతో అతను తన నలుగురు చెల్లెళ్ల బాధ్యత తీసుకుంటాడు.
Doctor Babu: సీరియల్ మిస్సవుతున్నానని ట్వీట్.. టీవీ పంపిన డాక్టర్ బాబు!
తల్లి సావిత్రి (రాశి) కూడా చిన్నతనంలోనే పిల్లల్ని వదిలేయడంతో చెల్లెళ్ల బాధ్యత గంగాధర్ తీసుకోవాల్సి వస్తుంది. తన చెల్లెళ్లకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసి వారి జీవితం ఆనందంగా సాగేలా చూడాలని కలలు కంటాడు గంగాధర్. అందుకోసం చాలా కష్టపడతాడు. కానీ అతని చెల్లెళ్లు వారివారి ఇష్టాలు, లక్ష్యాలకనుగుణంగా సాగాలని భావిస్తారు. ఈ ప్రయాణంలో గంగాధర్, అతని చెల్లెళ్లు ఎదుర్కొనే సవాళ్లు, కష్టాలు, పంచుకునే భావాలు, బాధ్యతల సమాహారమే మా అన్నయ్య సీరియల్. ఒక మధ్యతరగతి కుటుంబంలో తోబుట్టువుల మధ్య బంధాన్ని మా అన్నయ్య సీరియల్ కళ్లకు కట్టినట్లు చూపించనుంది. ఈ సీరియల్కు సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అంచనాలను మరింతగా పెంచేశాయి. కుటుంబ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్న ఈ సీరియల్ ప్రేక్షకుల అంచనాలను మించి వినోదం పంచేందుకు సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న సీరియల్ మా అన్నయ్య, మార్చి 25న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు జీ తెలుగులో!