Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఇప్పటికే రెండు సినిమాలు నిర్మించింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకు సంబంధించిన ప్రకటనను వెలువరించింది. రజనీకాంత్ తో ఈ సంస్థ ‘రోబో’ సీక్వెల్ ‘2.ఓ’ను 2018లో తెరకెక్కించింది. అలానే ఆ తర్వాత రెండేళ్ళకు రజనీకాంత్ తో ‘దర్బార్’ మూవీని ప్రొడ్యూస్ చేసింది.
మార్చి 2, గురువారం లైకా ప్రొడక్షన్స్ ఫౌండర్ శుభకరన్ పుట్టిన రోజు సందర్భంగా రజనీకాంత్ తో తీయబోయే సినిమా విశేషాలను అధికారికంగా ప్రకటించింది. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ దర్శకుడు టి. జె. జ్ఞానవేల్ తో మూవీని నిర్మించబోతునట్టు లైకా సంస్థ తెలిపింది. దీనికి అనిరుథ్ సంగీతాన్ని అందించబోతున్నాడు. వచ్చే యేడాది ఈ సినిమాను విడుదల చేస్తామని ఆ ప్రకటనలో తెలిపారు. ఇది రజనీకాంత్ కు 170వ చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఏప్రిల్ 14న విడుదల కావాల్సిన ‘జైలర్’ సినిమా విడుదలలో కొంత జాప్యం జరిగే ఆస్కారం ఉందని కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. కొత్త విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించాల్సి ఉంది.