Nenevaru: భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నేనెవరు”. నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి పూనమ్ చంద్, కుమావత్, కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ప్రముఖ ఎడిటర్, స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ ఇందులో హీరోగా నటించాడు. సాక్షి చౌదరి హీరోయిన్ కాగా తనిష్క్ రాజన్, గీత్ షా, ‘బాహుబలి’ ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తొలికాపీ సిద్ధమైన ‘నేనెవరు’ సినిమాను డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
మూవీ ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తూ, తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. దీని గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ”ఇప్పటికే మా మూవీ నుండి టీజర్ వచ్చింది. దానికి చక్కని స్పందన లభించింది. యువత కోరుకునే యాక్షన్, లవ్ సీన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కథలోనూ కొత్తదనం ఉంది. ఈ సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. హీరో కోలా బాలకృష్ణ, దర్శకుడు నిర్ణయ్, సంగీత దర్శకుడు ఆర్. జి. సారథిలకు చాలా మంచి పేరు తెస్తుంది” అని అన్నారు. రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్. రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఎడిటర్ కోలా భాస్కర్ కు ఇదే చివరి చిత్రం కావడం విశేషం.