‘టైటానిక్’ హీరో లియోనార్డో డి కాప్రియో ప్రేమాయణాలను పరిశీలిస్తే అతగాడికి ఇరవై ఐదేళ్ళ వయసు అంటే భలే ఇష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి దాకా ముగ్గురితో సహజీవనం చేశాడు లియోనార్డో. వారందరితోనూ ‘పైలా పచ్చీసు’గా ప్రేమయాత్రలు సాగించాడు. ఈ ’25’ వ నంబర్ గొడవేంట్రా బాబూ అంటూ జనం లియోనార్డోను ట్రోల్ చేస్తున్నారు. అయితే అతగాడు మాత్రం నా రూటే సెపరేటు అంటూ సాగుతున్నాడు. ఇటీవలే అమెరికన్ మోడల్ కెమిలా మర్రోన్ తో తెగతెంపులు చేసుకున్నాడు. తాజాగా సూపర్ మోడల్ గిగి హేడిడ్ తో ప్రణయగీతాలు ఆలపిస్తున్నాడు అయ్యగారు. లియోనార్డోతో ప్రేమాయణం సాగించిన వారిలో గిగి ప్రత్యేకం అంటున్నారు. ఎందుకంటే ఆమెకు ఇప్పటికే పాతికేళ్ళు దాటాయి. గతంలో అయ్యగారు ప్రణయకలాపాలు నెరిపిన వారందరూ పాతికేళ్ళలోపు వారే. వారికి పాతికేళ్ళు దాటగానే గుడ్ బై చెప్పేశాడు. మరి గిగికి పచ్చీసు దాటినా ఆమెతో ప్రణయతీరాలు దాటాలని ఆరాట పడుతున్నాడు లియోనార్డో!
విషయానికి వస్తే – 1997లో ‘టైటానిక్’ తో స్టార్ డమ్ దక్కించుకోగానే లియోనార్డో విరహం పురులు విప్పుకుంది. పైగా ఆ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా లియోకు క్రేజ్ రావడంతో పలువురు పడచుపిల్లలతో ఎంజాయ్ చేశాడు. ఓ మూడేళ్ళయిన తరువాత బ్రెజిలియన్ మోడల్ గిసెలె బుండ్చెన్ తో సహజీవనం మొదలెట్టాడు. ఆ సమయంలో గిసెలె వయసు అక్షరాలా ఇరవై సంవత్సరాలు. ఓ ఐదేళ్ళు ఆమెతో సజావుగా సాగి, ఆ పై బ్రేకప్ చెప్పేశాడు. తరువాత ఇజ్రాయెలీ మోడల్ బార్ రఫేలీతో 2005 నుండి సహజీవనం మొదలెట్టాడు. ఆ సమయంలో బార్ వయసు కూడా ఇరవై ఏళ్ళు. ఆరేళ్ళ సహజీవనం తరువాత విడిపోయారు. 2017లో అమెరికన్ మోడల్ కెమిలా మర్రోన్ తో రొమాన్స్ మొదలు పెట్టాడు. ఆ సమయంలో కెమిలా వయసు కూడా ఇరవై సంవత్సరాలే. ఐదేళ్ళు కాగానే ఆమెకూ గుడ్ బై చెప్పేశాడు. ఇరవై ఏళ్ళ భామలు, అందునా సూపర్ మోడల్స్ పైనే మనసు పడుతూ వచ్చిన డి కాప్రియో ఈ సారి 27 ఏళ్ళ సుందరిని ఎంచుకోవడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి గిగి హేడిడ్ తో లియో ఎన్నాళ్ళు ప్రణయ యాత్ర చేస్తాడో చూడాలి.