రచయిత,నటుడు గొల్లపూడి మారుతీరావు రాసిన అనేక రచనలు తెలుగు పాఠకలోకాన్ని ఆకట్టుకున్నాయి. ఇక చిత్రసీమలోనూ ఆయన మాటలు, కథలు భలేగా మురిపించాయి. మహానటుడు నటరత్న యన్.టి.రామారావు నటించిన “నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, నేరం నాదికాదు ఆకలిది” వంటి సూపర్ హిట్ హిందీ రీమేక్ సినిమాలకు గొల్లపూడి మాటలు రాశారు. ఆ చిత్రాల షూటింగ్ సమయంలో యన్టీఆర్ కు అదేపనిగా డైలాగ్స్ నేరేట్ చేసేవారు గొల్లపూడి. రామారావును ఎంతగానో అభిమానించడం వల్ల ఆయన వాచకశైలిని ఉద్దేశించే గొల్లపూడి పదాలు పలికించేవారు. ఇక గొల్లపూడి ఇంట్లో వారి తల్లి, భార్య సైతం శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలకు ప్రాణం పోసిన యన్టీఆర్ అంటే ఎంతో అభిమానించేవారు. అందువల్ల రామారావు పాత్రకు ఏ రీతిన డైలాగ్స్ రాస్తే జనం జేజేలు కొడతారో ఊహించి రాసేవారు గొల్లపూడి. అదే తీరున షూటింగ్ లో రామారావుకు డైలాగ్ రీడింగ్ ఇచ్చేవారు. దాంతో గొల్లపూడి అంటే రామారావుకు కూడా ఎంతో అభిమానం ఉండేది.
గొల్లపూడి రచనతో రూపొందుతోన్న ‘నేరం నాది కాదు ఆకలిది’ షూటింగ్ సమయంలో ఆయన రాలేదు. ఎందుకని రామారావు వాకబు చేయగా, గొల్లపూడికి ఒంట్లో బాగోలేక రాలేదని నిర్మాత, దర్శకుడు చెప్పారు. వెంటనే యన్టీఆర్ షాట్ గ్యాప్ లో గొల్లపూడి వారింటికి పరామర్శించేందుకు కారులో వెళ్ళారు. హఠాత్తుగా ఆయన రాకను చూసిన గొల్లపూడి, వారింట్లోని వారు సైతం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎంతో సంతోషించారు. ముఖ్యంగా గొల్లపూడి వారి తల్లి ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకొనేవారట! తమ ఇంటిల్లిపాది ఎంతగానో అభిమానించే రామారావుతో నటించాలన్న అభిలాష గొల్లపూడికి ఉండేదట. కానీ, గొల్లపూడి నటుడు అయ్యే సమయానికే రామారావు రాజకీయ ప్రవేశం చేశారు. ఆ తరువాత ఏదో ఒకరోజున మళ్ళీ రామారావు నటించక పోతారా, ఆయనతో కలసి నటించనా అని గొల్లపూడి చెప్పుకొనేవారు.అయితే అది తీరలేదు. ఈ విషయాన్ని పలుమార్లు చెప్పుకున్నారు గొల్లపూడి.