టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం హ్యపీ బర్త్ డే చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో లావణ్య ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటూ సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకొంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బంగార్రాజు చిత్రంలో నటించకపోవడానికి కారణం చెప్పింది. నాగార్జున, నాగచైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కిన బంగార్రాజు చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. 2016 లో రిలీజ్ అయిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.
ఇక సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నాగ్ సరసన లావణ్య రొమాన్స్ చేసిన విషయం విదితమే. ఈ సినిమ లావణ్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ లో మీరెందుకు నటించలేదు అని అడిగిన యాంకర్ ప్రశ్నకు లావణ్య సమాధానమిస్తూ “బంగార్రాజులో నటించమని నాగార్జున స్వయంగా కాల్ చేసి అడిగారు.. అయితే అప్పటికే నేను యుద్ధం శరణం లో నాగ చైతన్యకు జోడిగా నటించాను. ఇప్పుడు బంగార్రాజు చిత్రంలో చైతూకు తల్లిగా అంటే చేయలేను” అని సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పుకొచ్చింది. మరి హ్యాపీ బర్త్ డే సినిమా లావణ్యకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.