చిత్రసీమలో సంపాదించింది మళ్ళీ చిత్రసీమలోనే ఖర్చు పెట్టాలనే కోరిక కొందరికి ఉంటుంది. లతా మంగేష్కర్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఆమె మరాఠీలో కొన్ని సినిమాలు నిర్మించారు. 1953లో ‘వాడాల్’, ‘జాంజార్’ అనే సినిమాలు తీశారు. ఆ రెండూ బాగానే ఆడాయి. ఆ తర్వాత 1955లో ‘కాంచన్’ చిత్రం నిర్మించారు. అదీ ఫర్వాలేదనిపించింది. భారీ బడ్జెట్ తో 1990లో నిర్మించిన ‘లేకిన్’ మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలానే లతా మంగేష్కర్ కూ కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. కచేరీలు, పాటల రికార్డింగ్ సమయంలో చెప్పులు ధరించడం ఆమెకు ఇష్టం ఉండేది కాదు.
Read Also : లతాజీ ఇంటి పేరు వెనుక ఉన్న కథ
ఇక అంచులు రంగుల్లో ఉన్నా తెల్ల చీర ధరించడానికే ఆమె ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రత్యేకంగా ఫంక్షన్స్ లో పాల్గొనేప్పుడు ధవళ వస్త్రాలనే ఆమె ధరించడానికి ఆసక్తి చూపించే వారు. పాట పాడే ముందు దానిని తన భాషలో రాసుకోవడంతో పాటు కాగితం పైన శ్రీ అని రాయడం ఆమెకు అలవాటు. లతా మంగేష్కర్ స్కూల్ కు వెళ్ళింది కేవలం ఒక రోజు మాత్రమే కానీ ఆమెకు న్యూయార్క్ యూనివర్శిటీతో సహా ప్రపంచంలోని మొత్తం ఆరు యూనివర్శిటీలు గౌరవ డాక్టరేట్ ను అందించాయి. స్వభావ రీత్యా ఆమె సిగ్గరి అయినా జోక్స్ వేయడం, మిమిక్రీ చేయడం ఆమెకు సరదా!