ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ చలనచిత్రసీమలో మకుటం లేని మహారాజులా ‘హాలీవుడ్’ సాగిపోతూనే ఉంది. సినిమాను కనుగొన్న ఫ్రెంచివారిని సైతం తొలి రోజుల్లోనే దాటేసిన అమెరికన్ సినిమా ఎప్పటికప్పుడు తన ఉనికిని మరింతగా విస్తరించుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలోనే నటనలో ఎవరు ఎక్కడ విజయం సాధించినా వారిని ఇంగ్లిష్ నటీనటుల పేర్లతో పిలవడం మన భారతీయులకు అలవాటయి పోయింది. దిలీప్ కుమార్ ను ఇండియన్ మార్లన్ బ్రాండో అనేవారు. ఇక రాజ్ కపూర్ ను చార్లీ చాప్లిన్ డూప్ అనీ చెప్పేవారు. అలాగే ఆ నాటి మరో స్టార్ హీరో దేవానంద్ ను ఇండియన్ గ్రెగరీ పెక్ అని పిలిచేవారు. షమ్మీ కపూర్ ను మరో ఎల్విస్ ప్రిస్లీ అనీ అన్నారు. అయితే వారికే మాత్రం తీసిపోని నటులు మన వాళ్ళు. అయినా ఇంగ్లిష్ స్టార్స్ పేరుతో తమను పోల్చితే పొంగిపోయేవారు మన స్టార్స్. ఈ తరంలో అలా పిలిపించుకున్న వారు తక్కువే. ప్యాండమిక్ తరువాత హిందీ సినిమా బాగా చితికి పోయింది. అందువల్లే మళ్ళీ బాలీవుడ్ ను వెలిగించే నేపథ్యంలో హిందీ స్టార్ హీరోస్ ఒకనాటి టాప్ స్టార్స్ లాగా ఆంగ్ల చిత్రాలను రీమేక్ చేసే పనిలో పడ్డారు. కొందరు ఫ్రీమేక్స్ చేస్తూ సాగుతోంటే, ‘మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్’గా పేరొందిన ఆమిర్ ఖాన్ ఇరవై ఎనిమిదేళ్ళ నాటి హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా ‘లాల్ సింగ్ చడ్డా’ అంటూ రీమేక్ చేశారు. బహుశా ఆమిర్ కు, ‘ఫారెస్ట్ గంప్’ హీరో టామ్ హ్యాంక్స్ కు పోలికలు ఉన్నాయని ఎవరైనా అన్నారేమో!ఈ సినిమా ఆగస్టు 11న జనం ముందు నిలచి, ఘోర పరాజయాన్ని చవిచూసింది.
‘లాల్ సింగ్ చడ్డా’ హిందీ సినిమా వసూళ్ళతో పోల్చి చూస్తే హిందీలోకి డబ్ అయిన ‘ట్రిపుల్ ఆర్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలు భారీ మొత్తం పోగేసినట్టు ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. ‘లాల్ సింగ్ చడ్డా’ హిందీ వర్షన్ మొదటి రోజు రూ. 11 కోట్లు పోగేయడానికే ఆపసోపాలు పడిందట. ఈ మొత్తం ‘ట్రిపుల్ ఆర్’ హిందీ వర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ లో అక్షరాలా సగం ఉందట. ‘కేజీఎఫ్-2’తో పోల్చే వీలే లేదనీ బాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. మన సౌత్ సినిమాల్లో తప్పులు వెదుకుతూ పళ్లికిలించిన బాలీవుడ్ క్రిటిక్స్ ఇప్పుడు నాలుక్కరుచుకొని ‘తేలు కుట్టిన దొంగల్లా’ ఉన్నారు. ఆమిర్ ఖాన్ పైనే ఎంతోమంది బాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే అప్పట్లో ‘బాహుబలి’ సిరీస్ ను ఆమిర్ నటించిన ‘ దంగల్’ బీట్ చేసిందని టముకు వేశారు. కానీ, కొందరు బాలీవుడ్ క్రిటిక్సే ఇది నిజం కాదనీ తేల్చారు. అదలా ఉంచితే, హిందీలో టాప్ టెన్ గ్రాసర్స్ లో ఆమిర్ ఖాన్ నటించిన రెండు చిత్రాలు ‘దంగల్, పీకే’ చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆమిర్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా వసూళ్ళ వర్షం కురిపిస్తుందని బాలీవుడ్ బాబులు ఆశించారు. కానీ, మొదటి రోజునే వారి ఆశలపై ‘లాల్ సింగ్ చడ్డా’ నీళ్ళు చల్లడం గమనార్హం. మరి రాబోయే రోజుల్లో ఏ హిందీ సినిమా కలెక్షన్స్ లో ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’ను అధిగమించి ప్రథమస్థానంలో నిలుస్తుందో చూడాలి.