Lakshmi Parvathi: టీడీపీ అధినేత చంద్రబాబు ఏ ముహూర్తాన బాలకృష్ణ షో అన్ స్టాపబుల్ లో అడుగుపెట్టారో అప్పటి నుంచి ఈ షో గురించి అందరిలోనూ ఆసక్తి మొదలయ్యింది. ఇక ప్రోమోలో వ్యక్తిగత, రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ మాట్లాడడంతో ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందా..? అని అభిమానులతో పాటు రాజకీయ నాయకులు కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూసారు. ఇక ఆ సమయం వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే ఈ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలయ్యింది. ఇక ఎప్పుడైతే ఈ ఎపిసోడ్ బయటికి వచ్చిందో టీడీపీ పై విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ ఎపిసోడ్ పై ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి స్పందించింది. చంద్రబాబు, బాలయ్య తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ షో ను ఎంచుకున్నారని, అందులో వారు చెప్పిన ఏ విషయంలోనూ నిజం లేదని చెప్పుకొచ్చారు.
1995 నాటి ఘటనపై చంద్రబాబు వివరణ ఇచ్చారు.. ఆ సమయంలో ఎన్టీఆర్ కాళ్ళు కూడా పట్టుకొని బతిమిలాడాను అని చెప్పారు. ఆ వ్యాఖ్యలను లక్ష్మీ పార్వతి ఖండించింది. పార్టీలో గొడవలు చేయించింది అతనే.. ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా రోడ్డు మీదకు పిలిచింది.. ఎమ్మెల్యేలను రెచ్చగొట్టింది.. ఇవన్నీ నిజాలని ఆయనను ఒప్పుకోమనండని సవాల్ విసిరింది. ఎన్టీఆర్ కాళ్ళు చంద్రబాబు పట్టుకున్నాడు అన్నది పచ్చి అబద్దమని తేల్చి చెప్పింది. ఇక ఈరోజు ఈ షో చూసాకా బాలకృష్ణ అంటే పరమ అసహ్యమేస్తోందని.. ఛీ ఛీ అసలు అతను ఎన్టీఆర్ కొడుకా అన్నంత అసహ్యమేస్తోందని తెలిపింది. ఈ షో చూస్తున్నంత సేపు ఎన్టీఆర్ కు ఎవరైతే వెన్నుపోటు పొడిచారో వారిద్దరూ ఒకరినొకరు సమర్దించినట్లు కనిపించిందని, ఈ షోకు చంద్రబాబు రావడానికి కారణం కూడా ఈమధ్య ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది అతనేనని సాక్ష్యాలు బయటపడడంతో ఈ విధంగా కప్పిపుచ్చుకుంటున్నాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.