అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేసి విజయాలను అందుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. ఏదో ఒకరోజున తాను సినిమాకు దర్శకత్వం వహిస్తానని ముందుగానే చెప్పి, మరీ దర్శకురాలిగా మారారు బి.జయ. అసలే పురుషాధిక్య ప్రపంచంలో అందునా సినిమా రంగంలో ఎలా రాణిస్తావు? అని ఎందరో ఆమెను ప్రశ్నించిన వారున్నారు. వారందరికీ మెగాఫోన్ పట్టి సమాధానం చెప్పారామె. తెలుగు చిత్రసీమలో దర్శకత్వంలో రాణించే మహిళలు అరుదు. అలాంటి పరిస్థితుల్లో దర్శకురాలిగా తనదైన బాణీ పలికించి భళా అనిపించారు జయ.
కలిదిండి జయగా 1964 జనవరి 11న జన్మించారామె. తొలినుంచీ జయ తండ్రి ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. కూతురైనా సరే, కొడుకులా పెంచారు. దాంతో చదువుల్లో రాణిస్తూనే కళల పట్ల ఆసక్తి పెంచుకున్నారు జయ. చిన్నతనంలో నాటకాలు చూసి ప్రభావితురాలయిన జయ తరువాత షేక్స్ పియర్ పై అభిమానం పెంచుకున్నారు. షేక్స్ పియర్ నాటకాలు చదువుతూ సాగాలనే అభిలాషతో ఎమ్.ఏ. ఇంగ్లిష్ చదివారు. అలాగే మాతృభాష తెలుగులో ప్రతిభావంతులైన రచయితలందరినీ చదివేవారు. చదువుకునే రోజుల్లోనే కథలు, కార్టూనులు రాసేవారు. చదువు పూర్తయ్యాక రచయిత్రిగా మారారు. డిగ్రీ కాగానే ఓ నవల రాసేశారు. ఆపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ వద్ద సబ్ ఎడిటర్ గా పనిచేశారు. అదే సంస్థ ప్రచురిస్తున్న ‘జ్యోతిచిత్ర’కూ రిపోర్టర్ గా పనిచేశారామె. చిత్రసీమపై అభిమానం పెంచుకొని, తరువాత సినిమా జర్నలిస్ట్ గా మారారు. అదే సమయంలో ప్రముఖ ఫిలిమ్ జర్నలిస్ట్ బి.ఏ.రాజును పెళ్ళాడారు. భార్యాభర్తలిద్దరూ కలసి ‘సూపర్ హిట్’ అనే ఫిలిమ్ మేగజైన్ నెలకొల్పి, విజయవంతంగా నిర్వహించారు. వారి మేగజైన్ లో పనిచేసిన ఎందరో తరువాతి రోజుల్లో పలు సంస్థల్లో ప్రముఖ సినిమా జర్నలిస్టులుగా రాణిస్తున్నారు.
భార్యాభర్తలిద్దరికీ సినిమా అంటే ప్రాణం కావడంతో ‘సూపర్ హిట్ ఫ్రెండ్స్’ అనే బ్యానర్ నెలకొల్పి, తొలి ప్రయత్నంగా ‘ప్రేమలో పావనీ కళ్యాణ్’ సినిమా నిర్మించారు. ఈ చిత్రానికి ఘటికాచలం దర్శకులు. బి.జయ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. తరువాత జయ దర్శకత్వంలోనే బి.ఏ.రాజు ‘చంటిగాడు’ అనే లవ్ స్టోరీని నిర్మించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. తరువాత ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి చిత్రాలు జయ దర్శకత్వంలో తెరకెక్కాయి. వీటిలో ‘లవ్లీ’ మంచి ఆదరణ చూరగొంది.
కథకురాలిగా, జర్నలిస్టుగా, పత్రికాసంపాదకురాలిగా, దర్శకురాలిగా తనదైన బాణీ పలికించిన జయ 2018 ఆగస్టు 30న కన్నుమూశారు. తన బహుముఖ ప్రజ్ఞతో ఎంతోమంది హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు జయ.