కరోనా దెబ్బతో వచ్చిపడ్డ లాక్ డౌన్ థియేటర్లు బంద్ చేసింది. దాంతో బాలీవుడ్ క్రమంగా ఓటీటీకి అలవాటు పడుతోంది. అయితే, ఆన్ లైన్ వ్యవహారంలోనూ సినిమా వాళ్లకు సినిమా కష్టాలు తప్పటం లేదు. థియేటర్లలో రిలీజైనప్పుడు పైరసీ సమస్య ఉంటే… ఇప్పుడు లీకేజీ గండం ఎదురవుతోంది. లెటెస్ట్ గా కృతీ సనన్ ‘మిమి’ సినిమా లీకై షేకైపోయింది! నాలుగు రోజులు ముందుగానే హీరోయిన్ కి పురిటి నొప్పులు తప్పలేదు! ‘మిమి’ సినిమా మరాఠీలో విజయవంతం అయిన ‘మాలా ఆయి వాహ్చీ’కి హిందీ రీమేక్. అయితే, జూలై 30న స్ట్రీమింగ్ అవ్వాల్సిన సినిమాని 26వ తేదీనే అనూహ్యంగా జనం ముందుకి తీసుకొచ్చేశారు.
జూలై 27న బర్త్ డే జరుపుకుంటోన్న కృతీ సనన్ తన ఇన్ స్టాలో ‘మిమి’ రిలీజ్ ని అనౌన్స్ చేసింది. ‘మిమి’ లేబర్ రూమ్ కి ముందుగానే వెళ్లిపోయింది. బేబీ డెలివరీ జరిగిపోయింది. వెంటనే స్ట్రీమింగ్ లో ‘మిమి’ని చూసేయండి అంటూ విజ్ఞప్తి చేసింది. ‘మిమి’ సినిమా అద్దె గర్భం కథ. డబ్బుల కోసం హీరోయిన్ సరోగేట్ మదర్ గా మారుతుంది. ఆ క్రమంలో కొనసాగే కామెడీ అండ్ ఎమోషనల్ స్టోరీయే కృతీ సనన్ స్టారర్ ‘మిమి’. జాతీయ అవార్డ్ విజేత సమృద్ధి పోరే దర్శకత్వం వహించగా పంకజ్ త్రిపాఠీ, సుప్రియా పాఠక్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ‘మిమి’ సినిమాని ఓటీటీ రిలీజ్ తో సరిపెట్టుకున్న కృతీ సనన్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ‘ఆదిపురుష్, బచ్చన్ పాండే, బేడియా, గణ్ పత్, హమ్ దో హమారే దో’ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి…