Krishnam raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు నేటి ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విధద ఛాయలు అలముకున్నాయి. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వీలు కుదిరినప్పుడల్లా యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. అప్పట్లో సినిమా ప్రపంచం ఎలా ఉండేది దగ్గర నుంచి ఇప్పుడు తన నటవారసుడు ప్రభాస్ నటనను చూసి మెచ్చుకొనే వరకు అన్ని విషయాలను ఎంతో పొందికగా చెప్పుకొచ్చేవారు. ప్రభాస్ విషయంలో కృష్ణంరాజు ఎంతో గర్వంగా ఉండేవారు. తన కొడుకు పాన్ ఇండియా స్టార్ అయ్యాడని తెలిసి ఆయన సంతోషం మాటల్లో చెప్పలేనిది. అయితే ప్రభాస్ ను పాన్ ఇండియా నే కాదు పాన్ వరల్డ్ హీరోగా చూడాలనేది రెబల్ స్టార్ కోరిక. ఆ కోరిక తీరకుండానే ఆయన మృతిచెందడం అభిమానులకు తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.
ఒక ఇంటర్వ్యూలో రెబల్ స్టార్ మాట్లాడుతూ ” ప్రభాస్ అప్పుడే ఇంతటివాడు అయ్యాడంటే నమ్మబుద్దికావడం లేదు. ఈశ్వర్ ఫస్ట్ షాట్ ను ఫస్ట్ టేక్ లోనే ఓకే చేసిన ప్రభాస్ ఎంతో ప్రతిభా వంతుడు. అప్పుడే ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయ్యిందా అని అనిపిస్తోంది. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్.. మరికొద్దిరోజుల్లో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. అదే కనుక నిజమైతే ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ అవుతాడు. అలా జరిగినప్పుడు అందరిని పిలిచి ఒక పెద్ద సంబరంలా సెలబ్రేట్ చేస్తాను” అనిచెప్పుకొచ్చారు. మరికొన్ని రోజుల్లో ఆదిపురుష్ రిలీజ్ కానుంది. కానీ, ఇంతలోనే కృష్ణంరాజు ఈ లోకాన్ని వదిలివెళ్ళిపోయారు. కొడుకు విషయంలో ఆయన కోరిక నెరేవేరే సమయానికి ఆయన భౌతికంగా ఉండకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ప్రభాస్ కు ఉంటాయని అభిమానులు తెలుపుతున్నారు.