ప్రస్తుత యువ హీరోల్లో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న నాగశౌర్య త్వరలో ‘కృష్ణ వ్రింద విహారి’ గా రాబోతున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని ఐరా క్రియేషన్స్ పతాకంపై అనీస్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీ సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగ మేకర్స్ తాజాగా ‘వర్షంలో వెన్నెల..’ అనే రొమాంటిక్ మెలోడీ పాట మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో నాగ శౌర్య హీరోయిన్ షిర్లీ సెటియాతో ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని పండించాడు. వీరిద్దరి జంట ఈ వీడియోలో చూడముచ్చటగా ఉండి ఆకట్టుకుంటోంది. అలాగే పాట కూడా మెలోడియస్ గా ఉండి చిత్రీకరణ పరంగా కనువిందుచేస్తుండటం విశేషం. మహతి స్వర సాగర్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. ఆదిత్య ఆర్కే, సంజన కల్మంజే ఈ పాటకు తమ తమ గాత్రాలను అందించారు. శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. మేకింగ్ వీడియో చూసిన వారికి ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రంపై అంచనాలు పెరగటం ఖాయం. నాగశౌర్య తల్లిదండ్రులు ఉషా ముల్పూరి, శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవరిస్తున్నారు.