కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తాజాగా కన్నుమూశారు. కన్నడ ఇండస్ట్రీలో దేవుడిగా కొలిచే రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ ఇక లేడన్న విషయం ఆయన అభిమానులను శోకంలో ముంచేసింది. జిమ్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని భావించి ఆ తరువాత బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. 46 ఏళ్ల వయసులోనే ఆయనను కోల్పోవడం పట్ల ఇండస్ట్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచే కర్ణాటకలో హై అలెర్ట్ ప్రకటించారు. సినిమా థియేటర్లు మూసేశారు. కర్ణాటక ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు ఆసుపత్రిలోనే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వ్యక్తిగత జీవితం
కన్నడ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన పునీత్‌ని అభిమానులు అప్పూ అని ప్రేమగా పిలుచుకుంటారు. పునీత్ లెజెండరీ యాక్టర్ కంఠీరవ రాజ్‌కుమార్, పార్వతమ్మలకు చెన్నైలో జన్మించారు. రాజ్ కుమార్ కు పుట్టిన ఐదుగురు పిల్లల్లో పునీత్ చిన్నవాడు. ఆయన సోదరుడు శివ రాజ్‌కుమార్ ప్రముఖ నటుడు. పునీత్‌కు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు అతని కుటుంబం మైసూర్‌కు వెళ్లి, అక్కడే స్థిరపడింది. పునీత్ చిక్కమగళూరుకు చెందిన అశ్విని రేవంత్‌ని 1999 డిసెంబర్ 1 న వివాహం చేసుకున్నారు. పునీత్, అశ్విని దంపతులకు ఇద్దరు కుమార్తెలు ధృతి, వందిత.
Read Also : తీవ్ర విషాదంలో సినీ పరిశ్రమ… పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు
సినిమా కెరీర్
ఆయన దాదాపు 29కి పైగా కన్నడ చిత్రాల్లో నటించి అభిమానులను అలరించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన పునీత్ 1985లోనే “బెట్టాడ హూవు”లో తన నటనకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. “చలీసువ మొదగలు”, “యెరడు నక్షత్రాలు” వంటి చిత్రాలలో నటనకు బాలనటుడిగా పునీత్ కర్ణాటక రాష్ట్ర ఉత్తమ అవార్డును గెలుచుకున్నాడు.
“అప్పు” (2002)తో పునీత్ హీరోగా మారాడు. అదే పేరు పునీత్ ఇంటి పేరుగా మారింది. ఆ తర్వాత అతని అభిమానులు అతన్ని అప్పూ అని పిలవడం మొదలు పెట్టారు. అభి, వీర కన్నడిగ, అజయ్, అరసు, రామ్, హుడుగారు, అంజనీ పుత్ర వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు పునీత్. అతను చివరిసారిగా ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన “యువరత్న”లో కనిపించాడు. కన్నడ ఇండస్ట్రీలోనే పవర్ స్టార్ గా క్రేజ్ ను సంపాదించుకుని రాజ్ కుమార్ తనయుడు అన్పించుకున్నాడు.
కానీ ఇంత చిన్న వయసులోనే ఇండస్ట్రీ ఆయనను కోల్పోవడం బాధాకరం. పునీత్ మృతి సినిమా ఇండస్ట్రీని తీవ్ర విషాదంలో ముంచేసింది. పునీత్ రాజ్ కుమార్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు.