కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన ‘సమ్మతమే ‘ మూవీ ఈనెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. సినిమా అనేది ఎంతో మంది కష్టపడి తయారు చేస్తారని.. ఎందరో టెక్నీషియన్‌లు సినిమా కోసం రాత్రింబవళ్లు కృషి చేస్తారని తెలిపాడు. అలాంటి సినిమాను దయచేసి ప్రేక్షకులందరూ థియేటర్లలోనే చూడాలని హీరో కిరణ్ అబ్బవరం విజ్ఞప్తి చేశాడు. సినిమాను ఇంట్లో కూర్చుని చూద్దామనుకోవడం కరెక్ట్ కాదన్నాడు. మనం ఇంట్లో సినిమా చూస్తుంటే మధ్యలో ఎన్నో్ అవాంతరాలు కలుగుతాయన్నాడు. మధ్యలో ఎవరో ఫోన్ చేస్తే వాళ్లతో మాట్లాడేందుకు సినిమా చూడటం ఆపేస్తామని.. అప్పుడు సినిమా చూసిన ఫీలింగ్ రాదన్నాడు.
అయితే అలాగని ఇంట్లో సినిమాలు చూడటం తప్పు అని తాను చెప్పడం లేదని.. టీవీలో ఎప్పటి నుంచో మనకు అందుబాటులో ఉన్నాయని.. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తర్వాత అందరూ టీవీలలో సినిమాలు చూసేందుకే ఇష్టపడుతున్నారని హీరో కిరణ్ అబ్బవరం అభిప్రాయపడ్డాడు. తన లాంటి యంగ్ హీరోలకు ఓటీటీలు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాయని.. తమతో నిర్మాతలు సినిమాలు తీస్తున్నారంటే థియేటర్లలో కాకపోయినా ఓటీటీలలో విడుదల చేసుకుందామనే భావనలో ఉంటున్నారని.. అందుకే ఓటీటీలను తప్పుపట్టడం లేదన్నాడు. కాకపోతే సినిమాలు బతకాలంటే థియేటర్లలో చూస్తే మంచిదన్నాడు. సినిమాలు బతికించేలా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని.. తన లాంటి వ్యక్తులు చేసే చిన్న విన్నపాన్ని ప్రభుత్వాలు మన్నించాలని కోరాడు. కాగా ఈ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీందర్ హాజరయ్యారు.