మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న తమిళ ‘వేదాలం’ రీమేక్ లో ఆయన చెల్లెలి పాత్ర కోసం కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళంలో ఈ పాత్రను లక్ష్మీ మీనన్ చేసి మెప్పించింది. అయితే తెలుగు రీమేక్ విషయానికి వచ్చే సరికీ మొదటి నుండి దర్శక నిర్మాతలు కీర్తి సురేశ్ తోనే ఈ సిస్టర్ క్యారెక్టర్ చేయించాలని ఫిక్స్ అయిపోయారు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం.
మొదట కీర్తి సురేశ్ ను ఈ పాత్ర కోసం అప్రోచ్ కాగానే అమ్మడు రెండు కోట్ల రూపాయాలను డిమాండ్ చేసిందట. నిజానికి ‘మహానటి’తో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నప్పుడే కీర్తి సురేశ్ తన రెమ్యూనరేషన్ పెంచేసిందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కీర్తి సురేశ్ కొన్ని లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ నటించింది. ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ వంటి చిత్రాలు పరాజయం పొందాయి. అయితే కీర్తి సురేశ్ అడిగిన భారీ మొత్తాన్ని నిర్మాతలు ఇవ్వడానికి సిద్ధపడినా, చిరంజీవి వారిని వారించారని తెలిసింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కే కీర్తి సురేశ్ అంత మొత్తం తీసుకోనప్పుడు ఈ సినిమాకు అంత రెమ్యూనరేషన్ ఇవ్వడం ఎందుకుని మెగాస్టార్ అభిప్రాయపడ్డారట. ఈలోగా కరోనా సెకండ్ వేవ్ రావడంతో షూటింగ్స్ బంద్ అయ్యాయి.
ఈ మధ్యలో కీర్తి సురేశ్ కు ప్రత్యామ్నాయం కోసం దర్శక నిర్మాతలు వెతికారట. అందులో సాయి పల్లవి పేరు కూడా ఉందట. అయితే ఆమె డేట్స్ కేటాయించలేనని నిస్సహాయతను వ్యక్తం చేసిందట. దాంతో చిరంజీవిని ఒప్పించి, చివరకు తిరిగి కీర్తి సురేశ్ నే దర్శకుడు మెహర్ రమేశ్ అప్రోచ్ అయ్యాడట. ఇప్పుడు కీర్తి సురేశ్… ఆ పాత్ర చేయడానికి దాదాపు మూడు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ కు డేట్స్ కేటాయించేశారు. దానితో పాటు కాస్తంత అటు ఇటుగా ‘వేదాలం’ రీమేక్ షూటింగ్ సైతం మొదలు పెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. సో… ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే నటి డేట్స్ కోసం తంటాలు పడే కంటే కీర్తి సురేశ్ అడిగి మొత్తం ఇచ్చేయడమే బెటర్ అనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారన్నది తాజా సమాచారం. మొత్తానికీ కీర్తి సురేశ్ రెమ్యూనరేషన్ విషయంలో తన మాటే నెగ్గించుకుందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.