బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్ కు డబుల్ ధమాకా లభించింది. కొద్ది రోజుల క్రితమే భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది కంగనా రనౌత్. తాజా సోమవారం రాష్ట్రపతి గౌరవనీయులు రామ్ నాథ్ కోవింద్ నుండి పద్మశ్రీ పురస్కారం పొందింది. భారత ప్రభుత్వం తనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందని కంగనా తెలిపింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తన మనసులోని మాటలను వ్యక్తం చేసింది. ”నటిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన తర్వాత ఎంతోకాలానికి కానీ నాకు విజయం దక్కలేదు. అయితే ఒకసారి విజయాన్ని సాధించిన తర్వాత నాకంటూ కొన్ని సొంత అభిప్రాయాలను ఏర్పరచుకుని ముందుకు సాగాను. ఫేర్నెస్ క్రీమ్ లకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలలో నటించకూడదని అనుకున్నాను. అలానే ఐటమ్ సాంగ్స్ నూ తిరస్కరించాను. పెద్ద నిర్మాణ సంస్థలు, పెద్ద హీరోలతో తీసే సినిమాలను నేను వదులుకున్నాను. దాంతో చాలామందికి నేను శత్రువును అయ్యాను. నేను ఈ రంగానికి వచ్చి సంపాదించిన డబ్బులకంటే శత్రువులే ఎక్కువ. జీహాదీ, ఖలిస్తానీ తీవ్రవాదుల చర్యలను నేను బాహాటంగా ఖండించాను. దాంతో నా మీద దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని కేసులు నమోదు అయ్యాయి. నీకు సంబంధం లేని విషయాల గురించి ఎందుకు స్పందించి, కష్టాలు కోరి తెచ్చుకుంటావు అని చాలామంది చెబుతుంటారు. కానీ ఈ దేశానికి వ్యతిరేకంగా జరిగే చర్యలను నేను తట్టుకోలేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నన్ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడానికి నేను ఎంచుకున్న మార్గమే కారణమని అర్థమైంది. అందుకు కారకులైన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను” అని కంగనా పేర్కొంది.
మరో విశేషం ఏమంటే… కంగనా రనౌత్ తొలిసారి మణికర్ణిక ఫిలిమ్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ బ్యానర్ మీద కంగనా ‘టీకు వెడ్స్ షేరు’ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవ్నీత్ కౌర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సాయి కబీర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సోమవారం నాడు మొదలైంది.