కళలకు, కళాకారులకు హద్దులన్నవి లేవని ఈ ‘గ్లోబలైజేషన్’ అవతరించక మునుపే పెద్దలు చాటింపు వేశారు. దాంతో ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టడానికి జనం సైతం సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలోనూ మన దేశంలో ఓ కువిమర్శకుడు ఉత్తరం, దక్షిణం అన్న భేదాలు చూపిస్తూ తన కుల్లును బయటపెట్టుకుంటున్నాడు. తనకు తాను విమర్శకుడినని ప్రకటించుకున్న కమాల్ ఆర్. ఖాన్ మొన్న ‘ట్రిపుల్ ఆర్’ విడుదలైన సమయంలో బాలీవుడ్ లో ఆ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రాగానే, తట్టుకోలేక పోయాడు. ఎందుకంటే, ‘ట్రిపుల్ ఆర్’ డైరెక్టర్ రాజమౌళి తీసిన ‘బాహుబలి’ సిరీస్ ఉత్తరాదిని సైతం ఊపేశాయి. ఆ బాధతోనే కొందరు బాలీవుడ్ బాబులు సాగుతున్నారని వినిపిస్తోంది. అయితే వారందరిలోకి తానే మిన్న అని నిరూపించుకో దలచుకున్నాడేమో కమాల్ ఆర్.ఖాన్ ప్రతీసారి తన కుల్లుబుద్ధి బయట పెట్టుకుంటున్నాడు. సౌత్ , నార్త్ అంటూ తేడాలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగువారిపై విషం చిమ్ముతున్నాడు. ‘ట్రిపుల్ ఆర్’ రిలీజైన రోజునే రాజమౌళిని జైల్లో పెట్టాలనీ అన్నాడు. ఇప్పుడు తాజాగా ‘ద కశ్మీర్ ఫైల్స్’ గ్రాండ్ సక్సెస్ ను బాలీవుడ్ కు ఆపాదించడం తాను అంగీకరించనని చెబుతున్నాడు.
‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా చిన్న చిత్రంగా వచ్చి, అతి పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో కశ్మీరీ పండిట్స్ పై అప్పట్లో జరిగిన దారుణకాండను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇందులో హిందీనటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి వంటివారు నటించారు. ఈ చిత్రాన్ని వివేక్ అగ్నిహోత్రి రూపొందించారు. కేవలం రూ.15 కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ.330 కోట్లు పోగేసింది. దేశంలోని హిందువులలో అత్యధికులు ఈ చిత్రాన్ని విశేషంగా ఆదరించారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయించారు. ఇంతలా అలరించిన ఈ చిత్ర విజయాన్ని తాను బాలీవుడ్ కు ఆపాదించనని కె.ఆర్.ఖాన్ చాటింపు వేస్తున్నాడు. ఎందుకంటే ఈ సినిమాను సౌత్ కు చెందిన తెలుగు నిర్మాతలు నిర్మించారట! అయ్యగారి బాధ అదన్నమాట! ఈ చిత్ర నిర్మాతల్లో తేజ్ నారాయణ్ అగర్వాల్ హైదరాబాద్ కు చెందినవారు. అది అయ్యగారికి నచ్చని అంశం! ఇది కాకుండా లోపల ఇంకా ఏముందో తెలియదు కానీ, ఇతగాడు తెలుగువారు ఏ విజయం సాధించినా తట్టుకోలేక పోతున్నాడు. అయ్యా… బాలీవుడ్ బాబులూ… ఇతగాణ్ణి ఎక్కడన్నా చూపించండి… లేకుంటే, ఈ రోజుల్లోనూ నార్త్, సౌత్ అంటూ విద్వేషాలు రేపేలా ఉన్నాడు.