Kalyan Ram Speech At Bimbisara Pre Release Event: ఈసారి తాను ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయనని తన ‘బింబిసార’ చిత్రంపై నమ్మకం వెలిబుచ్చాడు హీరో కళ్యాణ్ రామ్. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ సాక్షిగా కళ్యాణ్ ఆ మాట చెప్పాడు. ఈ సినిమా చూసిన తర్వాత 100కి రెండు వందల శాతం మీరు తప్పకుండా శాటిస్ఫై అవుతారని అన్నాడు. తమ తామ ఎన్టీ రామారావు పుట్టిన 100వ సంవత్సరంలో వస్తోన్న ఈ సినిమా ప్రతీ నందమూరి అభిమానిని గర్వపడేలా చేస్తుందన్నాడు. తెలుగు సినిమాకి, తమ కుటుంబానికి మూల కారకుడైన ఆయనకు ఈ సినిమాను అంకితం చేస్తున్నానని తెలిపాడు.
‘‘మనందరికీ చందమామ కథలు, అమరచిత్ర కథలతో పాటు జానపద సినిమాలంటే ఎంతో ఇష్టం. పాతాళ భైరవితో మొట్టమొదటగా ఆ జోనర్ సినిమాల్ని తాత మొదటలుపెట్టారు. ఆ తర్వాత బాబాయ్ ‘భైరవద్వీపం’, చిరంజీవి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలు చేశారు. వీటితో పాటు ఆ జోనర్లో మరెన్న చిత్రాలు మన ముందుకొచ్చాయి. అదే కోణంలో ఒక జానపద, సోషియో ఫాంటసీ సినిమా తీసుకురావాలని మేము చేసిన ప్రయత్నమే ఈ బింబిసార. ఆగస్టు 5వ తేదీన వస్తోన్న ఈ సినిమాను థియేటర్లకు వెళ్లి చూడండి. కచ్ఛితంగా ఇది అలరిస్తుంది. ఏ ఒక్కరినీ నిరాశపరచదు. 200 శాతం శాటిస్ఫై అవుతారు’’ అని కళ్యాణ్ రామ్ ప్రసంగించాడు. తప్పకుండా ఇది ఈ సినిమా నచ్చి తీరుతుందని కాన్ఫిడెన్స్‌ని వ్యక్తపరిచాడు.
అనంతరం.. ఈ సినిమాలో నటించిన హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు కళ్యాణ్ రామ్ పేరుపేరున ధన్యవాదాలు తెలిపాడు. ఈ చిత్రం కోసం ప్రతిఒక్కరూ ఎంతో కష్టపడ్డారని, వారి వల్లే ‘బింబిసార’ ఇంత అద్భుతంగా వచ్చిందన్నాడు. ట్రైలర్స్ అంత బాగా వచ్చాయంటే, అది దర్శకుడు వశిష్ట్ ప్రతిభేనని, సినిమా కూడా అంతే బాగుంటుందని పేర్కొన్నాడు. అయితే.. ఈ సినిమాకి ప్రాణం పోసింది మాత్రం కీరవాణినేని అన్నాడు. ఇక తనకు ఇంత పెద్ద సినిమా ఇచ్చిన నిర్మాత హరిబాబుకి తాను జీవితాంతం రుణపడి ఉంటానంటూ.. కళ్యాణ్ రామ్ తన ప్రసంగం ముగించాడు.