Jr NTR Gracing Brahmastra Pre Release Event: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాభ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా సెప్టెంబర్ 9వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తారాస్థాయిలో ప్రచార కార్యక్రమాల్ని చేపట్టింది. వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు ఈవెంట్స్ నిర్వహిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 2వ తేదీన భారీఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. తమ సినిమాను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువు చేసేందుకే ఈ ఈవెంట్‌కి శ్రీకారం చుట్టారు. అంతేకాదండోయ్.. ముఖ్య అతిథిగా జూ. ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపుతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. సోషల్ మీడియాలో ఒక స్పెషల్ వీడియోని కూడా షేర్ చేశారు.
‘‘ఇండియన్ సినిమా యొక్క మ్యాన్ ఆఫ్ మాసెస్ అయిన జూ. ఎన్టీఆర్.. సెప్టెంబర్ 2వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న బ్రహ్మాస్త్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. మాస్-త్రవర్స్‌కి సిద్ధంగా ఉండండి’’ అంటూ ట్విటర్ వేదికగా చిత్రబృందం ఓ వీడియోతో ట్వీట్ చేసింది. ఆల్రెడీ నాగార్జున నటిస్తుండటం వల్ల ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల దృష్టి పడింది. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దీన్ని తెలుగులో విడుదల చేస్తుండడంతో మరింత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు తారక్ అతిథిగా వస్తే.. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ తోడవ్వడం ఖాయం. కాగా.. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని తెరకెక్కిస్తున్నాడు. ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహర్ దీన్ని నిర్మించాడు.