‘హారీపాటర్’ రచయిత్రిగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించిన జె.కె.రోలింగ్ మాట తూలారు; నాలుక కరచుకున్నారు. ఇంతకూ ఏమిటి విషయం? త్వరలోనే జె.కె.రోలింగ్ వాయిస్ తో ‘ద విచ్ ట్రయల్స్ ఆఫ్ జె.కె. రోలింగ్’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె తన మనసులోని మాటలు చెబుతూ ‘ట్రాన్స్ జెండర్స్’పై కామెంట్ చేశారు. లింగమార్పిడిపై ఆమె వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆమె కామెంట్స్ ను అభిమానులు సైతం తప్పు పడుతున్నారు. అంతెందుకు ఆమె నవలల ఆధారంగా తెరకెక్కిన ‘హారీ పాటర్’ సిరీస్ లో హీరోగా నటించిన డేనియల్ ర్యాడ్ క్లిఫ్ తో పాటు అందులో ప్రధాన పాత్రలు ధరించిన ఎమ్మా వాట్సన్, రూపర్ట్ గ్రింట్, ఎడ్డీ రెడ్ మేన్ కూడా రోలింగ్ మాటలను తప్పు పట్టారు.
ఇంతకూ జె.కె.రోలింగ్ ఏమన్నారు? “సెక్స్ అన్నది నిజం కాకుంటే, స్వలింగుల మధ్య ఆకర్షణకు తావే లేదు. సెక్స్ అన్నది వాస్తవం కాకపోతే, భూమిపై స్త్రీ జాతే తుడిచి పెట్టుకుపోయేది” అంటూ తనలోని రచయిత్రిని ప్రదర్శించారు రోలింగ్. లైంగికసంపర్కమే లేకుంటే ఎంతోమంది మనసు విప్పు మాట్లాడే వీలుకలిగేది కాదనీ ఆమె అన్నారు. ఇందులో తప్పేముందంటారా? ట్రాన్స్ జెండర్స్ కూడా మనుషులేనని, వారికీ ఓ మనసుంటుందని, వారూ ప్రేమించగలరన్న వాస్తవాన్నికాకుండా కేవలం ఆకర్షణ అనే రోలింగ్ నొక్కివక్కాణించడమే తప్పుగా మారింది. దాంతో రోలింగ్ పొరపాటు తెలుసుకున్నారు. తనకు ట్రాన్స్ జెండర్స్ అంటే, గౌరవాభిమానులు ఉన్నాయని, వారిని ఏ మాత్రం కించపరచలేదనీ చెప్పారు. అసలు ఎవరి మనసునూ నొప్పించడం తన నైజం కాదనీ ఆమె వివరించారు. రోలింగ్ నేపథ్యంలో రూపొందిన పాడ్ కాస్ట్ ‘ద విచ్ ట్రయల్స్ ఆఫ్ జె.కె.రోలింగ్’ ఈ నెల 21న విడుదల కానుంది. కనీసం ఆ తరువాతయినా, రోలింగ్ పై ట్రోలింగ్ తగ్గుతుందేమో చూడాలి.
Read Also: Delhi High Court: భర్తపై భార్య వేధింపులు.. విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు